మున్సిపోల్స్.. ఎప్పుడో..?

by Ratna Kumari |

దిశ‌, కామారెడ్డి : గ్రామాల అభివృద్ధికి నిధులు కావాలంటే సకాలంలో ఎన్నికలు జరగాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ నిబంధన

మున్సిపోల్స్.. ఎప్పుడో..?
X

దిశ‌, కామారెడ్డి : గ్రామాల అభివృద్ధికి నిధులు కావాలంటే సకాలంలో ఎన్నికలు జరగాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ నిబంధన కఠినంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. పట్టణాల విషయంలో ఇలాంటి నిబంధనలేమీ లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని పట్టణ వాసులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలకు మాత్రం నూతన పాలక వర్గాలు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేకపోవడంతో అభివృద్ధి పనులకు, సమస్యల పరిష్కారానికి పట్టణ వాసులు ఇంకా అధికారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 2025 జనవరి 25వ‌తేదీ గడువు ముగిసింది. అప్పటి నుంచి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్ మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్నారు. ప్రతీ నిర్ణయం, ప్రతీ అభివృద్ధి పనులకు పరిపాలనామోదం, తదితర పనులకోసం మున్సిప‌ల్ కమిషనర్లు ప్రత్యేక అధికారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాల పైనే ఆధారం..

ఎప్పుడైనా అనివార్య పరిస్థితులు మినహా చట్టసభలన్నిటికీ సకాలంలోనే ఎన్నికలు జరుగుతాయి. శాసన సభ, పార్లమెంట్ పదవీకాలం ముగిసే లోపే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తుంది. దీంతో గడువులోపు నూతన ప్రభుత్వాలు కొలువు దీరి అభివృద్ధి పనులు యదావిధిగా సాగుతుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షణ్యంపై ఆధారపడి ఉన్నాయి. రాజకీయంగా మేలు జరుగుతుందనుకుంటేనే సకాలంలో ఎన్నికలు నిర్వహించడం, ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయనుకుంటే వాయిదా వేయడం పరిపాటిగా మారింది.

కుంటుపడిన అభివృద్ధి

కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీ ల పాలక మండలిల గడువు సుమారు ఏడాదిక్రితం ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేక అధికారుల పాలనలో పురపాలన సాగుతున్నది. అయితే ప్రత్యేక అధికారులకు ఉండే రెగ్యులర్ పనుల ఒత్తిడికి తోడు మున్సిపాల్టీల అదనపు భారం పడుతుండటంతో వారు సంతకాలకే పరిమితమవుతూ పాలనాభారాన్ని మొత్తం ఆయా మున్సిపాలిటీల యంత్రాంగాలకే అప్పజెప్పుతున్న పరిస్థితి. అధికారుల అలసత్వంతో పట్టణాల అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రశ్నించే మునిసిపల్ కౌన్సిల్ లేకపోవడంతో మునిసిపల్ అధికారుల్లో జవాబుదారితనం లోపించిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యేడాదికాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మునిసిపాల్టీలలో వివిధ గ్రాంట్లు, నిధుల రూపంలో పనులు చేపట్టడం, ప్రతిపాదించడం, బిల్లుల చెల్లింపు జరిగిందని అంచనా. కౌన్సిలర్ ఉంటే మునిసిపల్ పనులతో పాటు పోలీస్టేషన్, రెవెన్యూ, ట్రాన్స్కో తదితర పనులన్నీ అతనే చూసుకునే వాడని, వార్డు పనులతో పాటు వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో ముందుండే వారని, కానీ సకాలంలో ఎన్నికలు జరపని ప్రభుత్వ వైఖరితో కౌన్సిలర్లు లేని లోటు తెలుస్తోందని పలువురు అంటున్నారు.

Next Story