- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌లో నామినేషన్లు షురూ
మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన వెంటనే బుధవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈనెల 30 వరకు కొనసాగనున్న నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొదటి రోజులు జిల్లాలో 21 నామినేషన్లు దాఖలయ్యాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన వెంటనే బుధవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈనెల 30 వరకు కొనసాగనున్న నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొదటి రోజులు జిల్లాలో 21 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో 12 నామినేషన్లు దాఖలు కాగా, ఆర్మూర్ మున్సిపాలిటీలో 5, భీమ్‍గల్ లో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. బోధన్ మున్సిపాలిటీలో మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దాఖలైన నామినేషన్లలో నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ తరఫున 5 నామినేషన్లు, కాంగ్రెస్ పార్టీ తరఫున 4 నామినేషన్లు, బీఆర్ఎస్ తరఫున 3 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో బీజేపీ 1, కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 నామినేషన్లు దాఖలయ్యాయి.
భీమ్‍గల్ మున్సిపాలిటీలో బీఎస్‍పీ నుండి 1 నామినేషన్, కాంగ్రెస్ నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36, బోధన్ లో 38, భీమ్‍గల్ లో 12 వార్డులున్నాయి. వీటన్నింటిల్లో రిజర్వేషన్ ల ప్రకారం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 30 న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. శుక్రవారం శుభప్రదమని నమ్మకంతో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరనే ఏ పార్టీలు కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అందరూ చివరి రోజే నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
పురపోరులో 4,95,485 మంది ఓటర్లు
నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్ సహా ఆర్మూర్, భీమ్‍గల్, బోధన్ మున్సిపాలిటీలలో 4,95,485 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,38,418 మంది ఓటర్లు కాగా, మహిళా ఓటర్లు 2,57,020, థర్డ్ జెండర్లు 47 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కన్నా 14,602 మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరందరి కోసం 729 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లు, పోలింగ్ స్టేషన్ ల సంఖ్యను మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే... నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 3,48,051 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,67,461 మంది, మహిళలు 1,80,546 మంది ఉండగా, ఇతరులు 44 మంది ఉన్నారు.
వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు 488 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. భీమ్‍గల్ మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులున్నాయి. 14,045 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 6,616 మంది, మహిళలు 7,429 మంది ఉన్నారు. వీరి కోసం 106 పోలింగ్ స్టేషన్లను అధికారులు సిద్ధం చేశారు. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులుండగా, 69,417 మంది ఓటర్లున్నారు. వీరిలో 33,693 మంది పురుషులు, 35,723 మంది మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటరు ఒకరున్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి 24 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. 63,972 మంది ఓటర్లున్నారు. వీరిలో 30,648 మంది పురుషులు, 33,322 మంది మహిళా ఓటర్లున్నారు. ఇద్దరు థర్డ్ జెండర్ ఓటర్లున్నారు.
పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
జిల్లాలోని కార్పొరేషన్ సహా అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని కూడా నియమించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 47 మంది జోనల్ ఆఫీసర్లు, 10 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌స్(ఎఫ్ ఎస్ టీలు), 12 మంది స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్స్ (ఎస్ ఎస్ టీ లు), 66 మంది రిటర్నింగ్ అధికారులు, 66 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 3,645 మంది పోలింగ్ సిబ్బందిని అధికారులు నియమించారు. ఎన్నికల నిర్వహణకు 875 బ్యాలెట్ బాక్సులు, ఇతర సంబంధిత ఎన్నికల స్టేషనరీ, సామాగ్రి ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..
మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ ఈనెల 27 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వచ్చిందని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎవరైనా కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు, వ్యక్తులు, సంస్థలు లేదా రాజకీయ పార్టీలపై సంబంధిత ఎన్నికల చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు ఈ షెడ్యూల్ ను గమనించి , ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఎన్నికల అధికారి కోరారు.






