‘ఆ పాపం వారిదే’.. గత ప్రభుత్వం పై ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-07 14:13:31  IST  )

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఆ పాపం వారిదే’.. గత ప్రభుత్వం పై ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లోని బిజెపి జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం చేసిన పాపానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని ఎంపీ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని అరవింద్ అన్నారు. స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పాపం కేసీఆర్ దేనని ఆయన అన్నారు.

కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు లెక్కలేనన్ని పాపాలు చేశారన్నారు. కాళేశ్వరాన్ని కట్టి లక్ష కోట్ల రూపాయలు ముంచేసి సముద్రం పాలు చేశాడని, తెలంగాణను అప్పులపాలు చేశాడని కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ వంటి ఎన్నో కేసుల్లో రేవంత్ సర్కారు ముందుకెళ్లలేని దుస్థితిలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థుడని అర్వింద్ అన్నారు. రేవంత్ రెడ్డి కెసిఆర్ తో ములాఖత్ అయ్యారని అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో వస్తున్న ఆదాయాన్ని అంతా కేసీఆర్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట లకే తీసుకెళ్లారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం భవిష్యత్తుపై ఎలాంటి ఫికర్ లేదని ఆయన అన్నారు. రైతులు పండించే పంట కోతకు రాకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు, కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవకుండా చూడాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటిదేమీ లేకుండా రైతులు వరి కోతలు ప్రారంభమయ్యాక తీరుబడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, కేంద్రాల్లో సమస్యలు పరిష్కారానికి ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ సంచులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. రైతులు ధాన్యాన్ని సకాలంలో తూకం వేసే పరిస్థితి కూడా లేదన్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్తున్నా కేంద్రాల్లో కొనే పరిస్థితి లేదని, రైస్ మిల్లర్లు కూడా విముఖత చూపించే పరిస్థితి ఉందని ఆయనన్నారు.

విద్యాభివృద్ధికి, స్కూల్స్ అభివృద్ధికి, హాస్పిటల్స్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన వంటి వాటికి కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అరవింద్ అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు కూడా రాష్ట్రం తన వాటాను ఇవ్వాలని దుస్థితిలో ఉండటంతో నిజామాబాద్ లోని పలు ఆర్వో బీల నిర్మాణం పనులు నిలిచిపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రం తన వాటా డబ్బులు ఇవ్వకపోవడంతో, కేంద్రం కూడా తన వాటా నిధులను విడుదల చేయడం లేదన్నారు. గతంలో రాష్ట్ర వాటానిధులతో సంబంధం లేకుండా కేంద్ర నిధులను విడుదల చేస్తే, ఆ నిధులన్నింటిని గత సర్కారు తన పథకాల అమలుకు మళ్లించుకుందని అరవింద్ అన్నారు. దీంతో ఇప్పుడు కేంద్రం రాష్ట్ర వాటా నిధులను విడుదల చేస్తేనే, కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.

ఆర్ఓబీలకు రాష్ట్ర నిధులను విడుదల చేస్తే, 48 గంటల్లో కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తుందని అర్వింద్ అన్నారు. దేశం మొత్తం మీద కేంద్రం ఒకే పాలసీని నడిపిస్తుందని, తెలంగాణలో రేవంత్ కోసం పోలీస్ పటేల్ పాలసీని ఫాలో కాదని అర్వింద్ ఘాటుగా అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీనే సరిగా లేడని, ఇక కింది స్థాయిలో ఉన్న నాయకులు ఎలా సరిగా ఉంటారని అరవింద్ ఎద్దేగా చేశారు. చొక్కా కున్న పై బటన్ నే సరిగా వేసుకోకపోతే కింది బటన్లన్నీ ఆర్డర్లో ఉండవని, రాహుల్, రేవంత్ సహా ఇతర కాంగ్రెస్ నాయకుల తీరును పోల్చారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, మహిళా నాయకురాలు స్రవంతి రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story