కందకుర్తి అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక శ్రద్ధ

by Nallavelli.Anjaneyulu |

కందకుర్తి గ్రామ సమగ్ర అభివృద్ధి పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఫోకస్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న చర్యలు స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

కందకుర్తి అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక శ్రద్ధ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కందకుర్తి గ్రామ సమగ్ర అభివృద్ధి పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఫోకస్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న చర్యలు స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుధవారం అర్వింద్ స్వయంగా కలుసుకుని కందకుర్తి అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. దూరదృష్టి, అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతలో భాగంగా మహారాష్ట్ర సరిహద్దులోని జాతీయ రహదారి నుంచి కందకుర్తి స్మృతి మందిరానికి అనుసంధానమయ్యే నూతన రహదారి మంజూరుకు ఎంపీ అర్వింద్ ప్రత్యేకంగా కృషి చేసి, అవసరమైన నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ రహదారి నిర్మాణం ద్వారా గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడనుంది. ఈ పనులు వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పర్యవేక్షణ కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా నవీపేట-కందకుర్తి ప్రధాన రహదారి మరమ్మత్తులకు సైతం నిధులు మంజూరు చేయించడంలో ఎంపీ అర్వింద్ కీలక పాత్ర పోషించారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల ప్రాంతీయ రవాణా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కందకుర్తిలో నిర్మితమవుతున్న కేశవ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవానికి ఈ నెల 11న మోహన్ భాగవత్ హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కందకుర్తికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు, ప్రాంతీయంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను భారీగా పెంచనుంది.

గోదావరి పుష్కరాల దృష్ట్యా కందకుర్తిలో వీఐపీ ఘాట్ నిర్మాణానికి సంబంధించిన అంశంపై కూడా ఎంపీ అర్వింద్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు కల్పించేందుకు, పుష్కరాల సమయంలో రాకపోకలు సులభంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘాట్ నిర్మాణం పూర్తయితే భక్తులకు సురక్షితమైన స్నాన వసతులు లభించడమే కాకుండా, కందకుర్తి ప్రాంతానికి పర్యాటక ప్రాధాన్యత కూడా పెరుగనుంది. మొత్తం మీద, కందకుర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎంపీ అర్వింద్ తీసుకుంటున్న చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూనే, అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి పని చేస్తానని అర్వింద్ అంటున్నారు.

Next Story