Suicide: టీఆర్‌ఎస్ నేతల వేధింపులు.. తల్లికొడుకులు బలవన్మరణం

by Disha Web Desk 4 |
Suicide: టీఆర్‌ఎస్ నేతల వేధింపులు..  తల్లికొడుకులు బలవన్మరణం
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల న్యూ మహారాజ లాడ్జీలో తల్లీకొడుకులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కామారెడ్డిలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మృతులు రామయంపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామయంపేట కేంద్రానికి చెందిన గంగు సంతోష్, పద్మ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజ లాడ్జీలో రూమ్ నంబర్ 203లో ఉన్నారు. అయితే తెల్లవారుజామున రూంలో నుంచి పొగలు రావడంతో లాడ్జీ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చూడగా తల్లికొడుకులు సజీవదహనమయ్యారు. అయితే తమ చావుకు ఆ ఏడుగురే కారణం అంటూ ఫోటోలు విడుదల చేశారు. దాంతో ఈ ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది. మృతులు రిలీజ్ చేసిన ఫోటోలలో గతంలో రామయంపేట సీఐగా పనిచేసి బదిలీపై వెళ్లిన నాగార్జున గౌడ్ సహా పలువురు రాజకీయ నాయకుల ఫోటోలు కూడా ఉండటం కలకలం రేపుతోంది. మృతులు చనిపోకముందు సెల్ఫీ వీడియో ద్వారా ఫేస్ బుక్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు.



'నా పేరు గంగు సంతోష్. మా నాన్న పేరు అంజయ్య. మా చావుకు ఆ ఏడుగురే కారణం. వారి వల్ల 18 నెలలుగా చాలా రకాలుగా నష్టపోయాం. నా తల్లిదండ్రులకు మనఃశాంతి లేకుండా చేశారు. ఆ ఏడుగురి ద్వారా మనఃశాంతి లేదు. వీళ్ళ వల్ల ఆస్తులు, డబ్బు నష్టపోయాను. అప్పులు కూడా చేశాను. డబ్బులు పోయినా పరవాలేదు. మళ్ళీ సంపాదించుకోగలను. నా పర్సనల్ వ్యవహారాలు రామయంపేట సీఐ నాగార్జున గౌడ్, జితేందర్ గౌడ్ లు మెమోరీ కార్డు ద్వారా తస్కరించి మానసికంగా వేధించారు. వారిపై ఫిర్యాదు చేసి 110 రోజులు అవుతోంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఫిర్యాదు చేసినా.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఒక్క శాతం కూడా న్యాయం జరగలేదు. ఇంకా వారి వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ వల్ల అమ్మా, నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఫ్యామిలీకి మిమ్మల్ని దూరం చేస్తున్నారు. మేము చనిపోయాక అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇక సెలవు' అంటూ సెల్ఫీ వీడియో ద్వారా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది. మృతులు విడుదల చేసిన ఫోటోలు రాజకీయ నాయకులకు సంబంధించినవి కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై కామారెడ్డి డీఎస్పీని వివరణ కోరగా.. ఉదయం తమకు లాడ్జీలో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు సమాచారం రావడంతో ఫైర్ సిబ్బందితో మంటలు ఆర్పి మృతులు ఉన్న గదిలోకి వెళ్లి చూసేసరికి చనిపోయారన్నారు. తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోందని, చనిపోకముందు ఫేస్ బుక్ లో వీడియో ద్వారా మాట్లాడిన విషయాలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


Next Story

Most Viewed