కేసీఆర్ నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్ష: మంత్రి వేముల

by Dishanational1 |
కేసీఆర్ నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్ష: మంత్రి వేముల
X

దిశ, భీమ్‌గల్: కేసీఆర్ నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్షలాంటిదని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రామ రాజ్యాన్ని తలపించేలా తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుతోందని, కేసీఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు, కులవృత్తులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి తెలిపారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని పోచంపాడ్ కోదండ రామాలయంలో రాములవారి కల్యాణోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోదండ రాముణ్ణి ప్రార్థించారు. కన్నుల పండువగా జరిగిన సీతారామ కల్యాణోత్సవం అనంతరం భక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మంత్రి వేముల దంపతులు స్వయంగా భక్తులకు వడ్డించారు.

అనంతరం మెండోరా మండలం పోచంపాడ్, సొన్ పెట్ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్ పై రూ. 1.30 కోట్లతో నిర్మించే నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కేసీఆర్ కృషి వల్ల ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాకతీయ కాలువ 365 రోజులు నిండుగా ఉంటుందని అందుకే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అయ్యిందన్నారు. ఇటీవల వర్షాలకు పాత బ్రిడ్జ్ రిపేర్ అయ్యిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. మొదట కోటి రూపాయలు అవుతుందని అంచనా వేస్తే ఏడాది పొడవునా నీరు ఉంటుండంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, ఆర్ అండ్ బీ శాఖ కొత్త టెక్నాలజీతో బ్రిడ్జి నిర్మిస్తుందని, అందుకు రూ. 25 నుంచి 30 లక్షల కోట్లు అదనంగా ఖర్చు అవుతున్నాయని వెల్లడించారు.

ఈ ప్రాంత ప్రజల పక్షాన అడగ్గానే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోటి 30 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. పోచంపాడ్, సొన్ పేట్ ప్రజల తరుపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కొద్ది రోజుల్లోనే బ్రిడ్జి అందుబాటులోకి రానుందని మంత్రి అన్నారు. పోచంపాడ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పై రూ. 25 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. లిఫ్ట్ వలన అధికారులకు ప్రాజెక్టు కింది బాగాన ఉన్న వరద గేట్లను పరిశీలించడానికి, ఇతర పనులకు అనువుగా మారనుంది. పోచంపాడ్ ప్రాజెక్ట్ పై రోడ్లు, రిటైనింగ్ వాల్, వరద గేట్ల మరమ్మతులు, ఇతర పనుల కోసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సుమారు రూ. 40 కోట్ల వరకు ఖర్చు చేశామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story