నిజామాబాద్‌లో టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

by Taduka Kalyani |   (  Updated:2025-06-23 16:34:17  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల ఉజ్వల భవిష్యత్తు కోసం నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కృషి చేస్తోంది.

నిజామాబాద్‌లో టాస్క్ ఆధ్వర్యంలో  మెగా జాబ్ మేళా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల ఉజ్వల భవిష్యత్తు కోసం నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ నగరంలోని ఐ టీ టవర్స్‌లో ఏర్పాటు చేశారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ఈనెల 25న (బుధవారం) ఉదయం 09:30 గంటలకు నిజామాబాద్ లోని కలెక్టరేట్ పక్కనగల ఐటీ టవర్స్‌లోని టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని ప్రాంతీయ కేంద్రాల రాష్ట్ర అధికారి సవీన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేళా ద్వారా డిప్లొమా, B.E/ B.Tech, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీ ఎస్ టెక్నాలజీస్, బయో టెక్నాలజీస్, స్కౌట్ బెట్టర్, ధరణి జియో స్పాటియల్ టెక్నాలజీస్, డెవ్లాట్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు సవీన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దడమే టాస్క్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎంపిక ప్రక్రియలో విజయవంతం కావాలంటే జాబ్ మేళాలో ఆత్మవిశ్వాసంతో పాల్గొనాలని రిలేషన్‌షిప్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి సూచించారు. అభ్యర్థులు ఎక్కువ కాపీల రెజ్యూమ్స్ తీసుకురావాలని సూచించారు.

Next Story