Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మళ్లీ తెరపైకి.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన రైతులు

by Kema Shiva Kumar |

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అసలు రద్దయ్యిందని గతంలో ప్రజా ప్రతినిధులు ప్రకటించారు.

Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మళ్లీ తెరపైకి.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన రైతులు
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అసలు రద్దయ్యిందని గతంలో ప్రజా ప్రతినిధులు ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఈ మాస్టర్ ప్లాన్ పై మళ్లీ కదలికలు వస్తున్నాయని చర్చకు దారి తీస్తుండటంతో గందర గోళం నెలకొంది. అసలు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు అయిందా? కాలేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రద్దు అయితే జీవో కాపీని ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయలేదు సందేహాలకు సమాధానం లభించడం లేదు. మాస్టర్ ప్లాన్ పై మళ్లీ మొదలైన చర్చ విలీన గ్రామాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ విషయమై అడ్లూరు, ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి మూడు రోజులపాటు నిర్వహించడంతో మాస్టర్ ప్లాన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 8 గ్రామాల భూములు గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్లుగా విభజిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై 8 గ్రామాల రైతులు అప్పట్లో 2022 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ప్రారంభించిన మాస్టర్ ప్లాన్ రద్దు ఉద్యమం 45 రోజులపాటు కొనసాగింది. ఈ ఉద్యమం గ్రామస్థాయి నుంచి మొదలుకొని జిల్లా కేంద్రం కామారెడ్డి వరకు కొనసాగింది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు, వివిధ సంఘాలు, నాయకులు పలు రకాల ఆందోళనలు, నిరసనలు చేపడుతూ 45 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగించారు. దీంతో ఉద్యమ వేడిని గ్రహించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కానీ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఎలాంటి జీవో రాకపోవడంతో మాస్టర్ ప్లాన్ రద్దు కాలేదని రైతులు గ్రహించి మళ్లీ ఉద్యమానికి తెర లేపారు. ఇందులో భాగంగానే శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ జీవో కాపీని విడుదల చేయాలని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. దీంతో మాస్టర్ ప్లాన్ వ్యవహారం మళ్లీ కొత్తగా తెరపైకి వచ్చింది.

గతంలో 45 రోజుల ఉద్యమం..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2022 డిసెంబర్ నెలలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలనే డిమాండ్ తో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. 45 రోజుల పాటు ఏకధాటిగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వివిధ రకాల్లో తమ నిరసనలు ప్రభుత్వానికి తెలియజేశారు. బాధిత రైతులంతా కుటుంబాలతో కలిసి రోడ్డెక్కారు. కలెక్టరేట్ ను దిగ్బంధించారు. ఉద్యమ సమయంలో రైతు రాములు మృతి ఉద్యమానికి మరింత అజ్యం పోసింది. దీంతో ఒక్కసారిగా ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా మున్సిపల్ పాలకవర్గం మాస్టర్ ప్లాన్ పై చర్చించేందుకు 2023 జనవరి 20 న ప్రత్యేక సమావేశమై మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేసింది. ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మాస్టర్ ప్లాన్ వివాదం, ఉద్యమం సద్దుమణిగింది.

భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన రైతులు..

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాల భవిష్యత్తు కార్యాచరణను రైతులు బుధవారం ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల్లో అందరినీ ఐక్యం చేసేందుకు రోజుకో గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ పై ఏ రకమైన ఉద్యమాలు చేపట్టాలో సమిష్టిగా నిర్ణయాలు తీనుకోనున్నట్లు చెపుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిలను కలిసి మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు తిప్పలు తప్పవా..?

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సద్దుమణిగిన మాస్టర్ ప్లాన్ వ్యవహారం, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ తెరపైకి రావడంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా మాస్టర్ ప్లాన్ వివాదం అధికార కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తెచ్చి పెట్టేలా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా అధికార కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చి జీవోను రద్దు చేయించుకోవాలని పట్టుబట్టేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుండడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు. వరుస ఎన్నికల నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందనేది తెలియాల్సి ఉంది. గత ఉద్యమ పరిణామాలను బేరీజు వేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తుందా? ఏం చేస్తుందనేది విషయాలపై ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు. ఒక వేళ రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ జీవో జారీ చేయాలని పట్టుబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మాస్టర్ ప్లాన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.

Next Story