తాడ్వాయిలో మ‌క్క సెగ‌.. మ‌రోవైపు పాలాభిషేకం

by Ratna Kumari |

తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం మక్కల కొనుగోలు చుట్టూ ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఓవైపు ధ‌ర్నా చేప‌డుతుండ‌గా.. మ‌రోవైపు రేపు కొనుగోలు కేంద్రం ప్రారంభం అవుతుంద‌ని సంబురాలు జ‌రుపుకుంటున్నారు.

తాడ్వాయిలో మ‌క్క సెగ‌.. మ‌రోవైపు పాలాభిషేకం
X

దిశ,​ తాడ్వాయి : తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం మక్కల కొనుగోలు చుట్టూ ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఒకవైపు రైతుల సమస్యలపై భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మహా ధ‌ర్నా చేపట్టగా.. మరోవైపు కొనుగోలు కేంద్రం ప్రారంభం కానుందన్న సంతోషంతో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ​మక్కల కొనుగోలులో జాప్యం జరుగుతోందని, తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న డబ్బులు రైతుల ఖాతాలో జ‌మ చేయాల‌ని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మహా ధర్నా నిర్వహించారు. కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంట వరకు ధర్నా కొనసాగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధర్నా అనంతరం రైతులందరూ నేరుగా రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి రైతుల సమస్యలపై రెవెన్యూ ఇన్ స్పెక్ట‌ర్ హారిక కు వినతి పత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విట్టల్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని 2,550 మంది రైతుల నుండి సుమారు లక్ష క్వింటాళ్ల మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని,కానీ ఇప్పటివరకు కేవలం 15,000 క్వింటాళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించిందని మండిపడ్డారు. మిగిలిన 85,000 క్వింటాళ్ల మక్కల డబ్బులను ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.​ మొదటి దఫాలో మక్కలు కొనుగోలు చేసినప్పటికీ, డబ్బులు ఎప్పుడు పడతాయోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతుల కష్టార్జితాన్ని సకాలంలో చెల్లించకపోవడం అన్యాయం అని విఠ‌ల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా ఒకవైపు కొనసాగుతుండగానే,మండల కాంగ్రెస్ నాయకులు మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా కాంగ్రెస్ మండల నాయకుల సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం రైతు పక్షపాతని, మక్కల కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వారు పేర్కొన్నారు. ​రేపే ఎమ్మెల్యే చేతుల మీదుగా మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలుపుతున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా మక్కల కొనుగోలు కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారు స్పష్టం చేశారు. ​నిరసనలు,పాలాభిషేకల మధ్య తాడ్వాయి మండల కేంద్రం ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది.

Next Story