- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి : భారతీయ కిసాన్ సంఘ్
మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు భారీ ఆందోళన చేపట్టారు.

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు భారీ ఆందోళన చేపట్టారు. తాడ్వాయి మండల కేంద్రంలోని కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. తాడ్వాయి మండలంలో అత్యధికంగా మొక్కజొన్న సాగు జరుగుతున్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతులు రోడ్డు మీదకు వచ్చే వరకు పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.ప్రతి సీజన్ లో పోరాటం చేస్తే తప్ప కొనుగోలు కేంద్రాలు తెరవరా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న యూరియా యాప్ విధానం వల్ల సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు పేర్కొన్నారు. కేవలం ఓటీపీ చెబితేనే యూరియా ఇస్తామనడం సరికాదని, చిన్న ఫోన్లు వాడే రైతులకు ఈ సాంకేతికత శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాడ్వాయిలో రెండో దపా మొక్కజొన్న సేకరణ సమయంలో రైతుల నుంచి సేకరించిన హమాలీ ఛార్జీల్లో దాదాపు రూ,1,83,000 వరకు అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని కిసాన్ సంఘ్ నేతలు తెలిపారు. అధికారుల చేతివాటం వల్ల రైతులకు జరిగిన ఈ నష్టాన్ని వెంటనే రికవరీ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాస్తారోకో అనంతరం రైతులు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. గతంలో ఇచ్చిన వినతిపత్రాలపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని తహసీల్దార్‌ను ప్రశ్నించగా, ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ మండలం అధ్యక్షుడు విఠల్ రెడ్డి, జాగృతి మండల అధ్యక్షుడు బుజంగావు, పీసురాజిరెడ్డి, కటికం రాజిరెడ్డి, వెంకట్ రావు, మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






