42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే లోకల్ ఫైట్ .. టీపీసీసీ చీఫ్ క్లారిటీ..!

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో బీసీ లకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చిందని, ఎన్ని అవాంతరాలొచ్చినా 42శాతం రిజర్వేషన్ల తోనే స్థానిక

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే లోకల్ ఫైట్ .. టీపీసీసీ చీఫ్ క్లారిటీ..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో బీసీ లకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను తీసుకొచ్చిందని, ఎన్ని అవాంతరాలొచ్చినా 42శాతం రిజర్వేషన్ల తోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామ‌ని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. బనకచర్ల, బీసీ రిజర్వేషన్లు, బీజేపీ – బీఆర్ఎస్ ల ద్వంద్వ వైఖరిపై తీవ్రంగా స్పందించారు. బనక చర్ల విషయంలో మంత్రి హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జీవోలు వెలువడ్డాయని టీపీసీసీ చీఫ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈ అంశాన్ని వదిలేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. రిజర్వేషన్ల విషయంలో అక్కడ వెసులు బాటు దొరుకుతుందనే ఆశాభావంతో తామున్నామని మహేశ్ గౌడ్ అన్నారు. రిజర్వేషన్ లు అడ్డుకోవడంతో అసలైన ముద్దాయి బీజేపీ యేనని ఆ పార్టీపై ఆయన దుమ్మెత్తి పోశారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసే బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మహేశ్ ఆరోపించారు. బీసీ ల రిజర్వేషన్ ఫైల్ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంచారన్నారు. గవర్నర్ ను నియమించేది ఎవరో అందరికీ తెలిసిందేనన్నారు. మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్సు గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకుంటున్నారని ఇది బీసీ సమాజం గమనిస్తోందని మహేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల పై చిత్త శుద్ధి ఉందని, బీజేపీ కూడా ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే మోడీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు మోడీ పై ఒత్తిడి తీసుకురావటం లేదని ప్రశ్నించారు. బనక చర్ల విషయంలో చేయాల్సింది అంత చేసారని, ఇప్పుడు ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఉదాసీనత వల్ల అప్పట్లో జీవో ఇచ్చారన్నారు.

రాయలసీమను రతనాల సీమను చేస్తానన్నది కేసీఆర్ కాదా?

రాయలసీమను రత్నాల సీమను చేస్తానన్నది కేసీఆరే నని, జీవోలపై ఆంధ్రా హక్కులను కాపాడతానన్నది కూడా కేసీఆర్ అని మహేశ్ అన్నారు.ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అడ్డుకునేందుకు ఫిర్యాదు చేసిందన్నారు.తెలంగాణ కు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రాకు వదులుకోమని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జగన్‌తో కేసీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, సంతోషంగా విందులు, వినోదాలు కూడా చేసుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారని ఆరోపించారు. బనక చర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. బనకచర్ల పై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో వివరించే ప్రయత్నం చేశారని మహేశ్ వివరించారు. మంత్రుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా అన్ని సర్దుబాటు చేసుకుంటామని, అది పెద్ద సమస్య కాదన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై కట్టుబడి ఉన్నాం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, అన్ని అవాంతరాలను అధిగమించి ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే యోచనలో తామున్నట్లు మహేశ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బీజేపీయే నని మహేశ్ కుమార్ గౌడ్ పదే పదే నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని, కుల గణన సర్వేను పారదర్శకంగా నిర్వహించామన్నారు. బీజేపీ,బీఆర్ఎస్ లు రెండూ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని మహేశ్ ఆరోపించారు. బీసీల నోటి కాడ ముద్దను లాగేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ లు ఢిల్లీ బీసీ రిజర్వేషన్ ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారని ప్రశ్నించారు. మాకు దమ్ముంది కాబట్టే బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మహేశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వయా నిజామాబాద్ రైల్వే లైన్ విషయమై సీఎం చర్చించానన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కృషి చేస్తానన్నారు. కామారెడ్డి బీసీ సభ తప్పకుండా ఉంటుందని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

ఆర్ఓబీ నిర్మాణాలకు కేంద్రం నిధులు రావాల్సి ఉంది

రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ ఓ బీ) ల నిర్మాణాలకోసం కేంద్రం నుండి నిధులు రావాల్సి ఉందని, కేంద్రం నుండి వాటి నిర్మాణాల కోసం రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతోనే పనుల్లో ఆలస్యం జరుగుతోందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, గడుగు గంగాధర్, నగేశ్ రెడ్డి ఉన్నారు.

Next Story