- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులే మిగిలె..చిన్న గ్రామాల్లోనూ 50లక్షల దాకా ఖర్చు !
ఎన్నికల మోజు తమను ఘోరంగా దెబ్బ తీసిందని, ప్రచారం కోసం రూ. లక్షలకు లక్షలు ఖర్చు చేస్తే అప్పులే మిగిలాయంటూ స్థానిక

అప్పులే మిగిలె..!
చిన్న గ్రామాల్లోనూ 50లక్షల దాకా ఖర్చు
మేజర్ గ్రామపంచాయతీల్లో కోటి రూపాయల వరకు
గెలుపు కోసం భూములు, ప్లాట్లు, బంగారం తాకట్టు...
ఓటమి తర్వాత కనీసం పలకరించని ముఖ్య నేతలు
ప్రచారం, పంపకాలతో కలిసి ఒక్కో అభ్యర్థి ఖర్చు తడిసి మోపెడు
దిశ, కామారెడ్డి : ఎన్నికల మోజు తమను ఘోరంగా దెబ్బ తీసిందని, ప్రచారం కోసం రూ. లక్షలకు లక్షలు ఖర్చు చేస్తే అప్పులే మిగిలాయంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. గెలుపు కోసం ప్రత్యర్థులను తట్టకుని గెలిచేందుకు అడ్డగోలుగా ఖర్చు చేసి అప్పుల పాలయ్యామంటూ వాపోతున్నారు. తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. గ్రామంలో కొంత పలుకుబడి, మంచి పేరున్న వ్యక్తులను, దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న నాయకులను ముఖ్య నాయకులు ఎన్నికల బరిలోకి దింపారు. పార్టీలోకి నిన్నా, మొన్నా వచ్చిన వాళ్లు ఎక్కడికో వెళ్లారు.. నీకు వయసైపోతోంది.. ఇంకా ఇప్పుడైనా ఎదగకపోతే ఇంకెప్పుడెదుగుతావంటూ రెచ్చగొట్టి బరిలోకి దింపారు. ప్రజల్లో మంచి పేరుందంటూ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేని వారిని ఎన్నికల బరిలో దింపారు, నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అభ్యర్థులు చేసిన ఖర్చుల కోసం చేసిన అప్పులు ఇప్పుడు వారి మెడకు యమపాశంలా చుట్టుకున్నాయి.
స్థానిక పోరులో గెలుస్తామనే ధీమాతో సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారు అందినకాడికి అప్పులు చేశారు. తమ భూములు, ఇళ్లు వంటి స్థిరాస్తులను ఫైనాన్షియర్ల వద్ద తాకట్టు పెట్టి కొందరు, ఉన్న ఆస్తులను అమ్ముకుని కొందరు గెలుపు కోసం విచ్చల విడిగా ఖర్చు చేశారు. ఎన్నికల్లో మద్యం కోసమే దాదాపు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థులు మాంసం పంపిణీ, నగదు పంపిణీ కోసం అంతకు మించి ఖర్చు చేశారు. ఖర్చులో ఎక్కడా తగ్గకుండా తిక్కతో ఖర్చులు చేసి తీరా ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక చేసిన అప్పులు గుర్తుకొచ్చి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుని కుటుంబంతో సహా కన్నీరు కారుస్తున్నారు. ఎన్నికల అప్పులు భారంగా మారాయని బాధ పడుతున్నారు
పోటాపోటీగా ఖర్చు..
మైనర్ గ్రామపంచాయతీలు, కొత్తగా ఏర్పాటైన గిరిజన గ్రామాల్లోనూ అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేసారు. ముందు చూపు లేకుండా కొందరు తమ స్నేహితులు, పార్టీ పెద్దలు ఉసిగొల్పితే ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలై అప్పులు తలుచుకుని అవస్థలు పడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థుల మాదిరిగా వార్డు సభ్యులు కూడా గెలుపు దాహం తీర్చుకునేందుకు రూ. లక్షల్లో ఖర్చు చేసిన గ్రామ పంచాయతీలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒకరిని చూసి ఇంకొకరు వేలం వెర్రిగా ఖర్చు చేసి తీరా ఓటమి పాలై ఏడుస్తూ కూర్చున్నారు. సాధారణ అంచనాతో నామినేషన్ వేసిన అభ్యర్థులకు చుక్కలు కనిపించేలా ఖర్చు చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు.
గెలవాలంటే ఖర్చు చేయాల్సిందేనని ట్యూన్ చేశారు..
ఎలక్షన్ లో గెలవాలంటే ఎదుటోడికన్నా ఎక్కువ ఖర్చు చేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని పార్టీ పెద్దలు, వెనకాల తిరిగే అనుచరులు అభ్యర్థులను మోటివేట్ చేశారు. తగ్గేది లేదంటూ ఖర్చు చేసేలా మెంటల్లీ ట్యూన్ చేశారు. చేసేది లేక అభ్యర్థులు కూడా అదే విధంగా ఖర్చు చేశారు. పోటాపోటీగా ప్రతిరోజూ మందు, విందులకు ఖర్చు చేయడంతో ఊహించిన దానికంటే మూడింతలు ఖర్చు పెరిగింది. ప్రచారం ముగిసిన తరువాత పోలింగు ముందు రోజు రాత్రి డబ్బులు, మద్యం, ఖరీదైన బహుమతులు, కానుకలు, మాంసం పార్శిల్స్ పంపిణీ చేయడంతో ఖర్చు తడిసి మోపెడైంది. ఒక్క ఓటు కూడా మిస్ కావద్దన్న పట్టుదలతో ఓటర్ల చేతిలో పసుపు, కుంకుమలు పెట్టి మరీ ఒట్టు వేయించుకున్నారు. ప్రత్యర్థులు పంపిణీ చేస్తున్న దాన్ని బట్టి అంతకు మించి ఒక్కో ఓటుకు రూ. వేయి నుండి రూ. 5 వేల చొప్పున తమ ఆర్థిక స్‌థోమతకు మించి నగదును పంపిణీ చేశారు. గెలుపు కోసం భూములు, ప్లాట్లు, బంగారాన్ని తాకట్టు పెట్టి భారీగా ఖర్చు చేశారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఖర్చు రూ. కోటి వరకు కావడం గమనార్హం. ఒక్కోచోట ఇద్దరు, ముగ్గురు బరిలో ఉండడంతో పోటీ తీవ్రంగా మారింది.
గాలి ప్రచారాన్ని నమ్మి...
నువ్వే గెలుస్తున్నావ్... ఖర్చుకు వెనకాడకు అంటూ వ్యూహాత్మకంగా ప్రత్యర్థులు వారి అనుచరులతో గాలి ప్రచారం చేయించారు. ఇది నమ్మిన అభ్యర్థులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, స్థోమతకు మించి స్థిరాస్తులను తాకట్టు పెట్టే స్థాయికి ఖర్చును పెంచేసుకున్నారు. లక్షల్లో, కోట్లల్లో అప్పులు తెచ్చారు. అప్పులు ఇప్పించే కమీషన్ ఏజెంట్లు అభ్యర్థుల ఆస్తులను తాకట్టు పెట్టించి లక్షల్లో కమీషన్లు సంపాదించారు.
ఓటమి బాధ... అప్పుల భయం
తీరా ఎన్నికల ఫలితాలు బెడిసి కొట్టడంతో ఇప్పుడు అభ్యర్థులకు పద్మవ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఓటమి వెక్కి రిస్తుండగా, మరోవైపు అప్పులు భయపెట్టిస్తున్నాయి. ఓటమి పాలైన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు.. తెచ్చిన అప్పులకు నెలనెలా వడ్డీ లెలా కట్టాలి? అసలు అప్పు తీర్చేదెన్నడోనని తలలు పట్టుకుంటున్నారు. అభ్యర్థుల ఓటమి వారి కుటుంబాలను కూడా తీవ్ర వేదనకు గురిచేస్తుం డడం గమనార్హం.
కరువైన నేతల పలకరింపులు
ఓటమి పాలైన అభ్యర్థులను ఆయా పార్టీల ముఖ్య నేతలు కనీసం పలకరించకపోవడం వారిని మరింత కలవరపెడుతున్నది. అన్నీ తామై ఎన్ని కల ఏర్పాట్లు చూసుకుని, సొంతంగా ప్రచారం చేసుకుని, భారీ మొత్తంలో ఖర్చు పెట్టుకుని బరిలో నిలిచి ఓటమిని చవిచూసిన అభ్యర్థులకు సొంత పార్టీ ముఖ్య నేతల నుంచి కనీస ఓదార్పు లేకపోవడం మరింత ఆవేదన కలిగిస్తున్నది. కొన్ని గ్రామాల్లో స్వయంగా ప్రధాన పార్టీల రాష్ట్ర నేతలు ప్రచారం చేసినా అభ్యర్థులు ఓటమి చెందడం గమనార్హం. కోట్లు ఖర్చు చేసిన అభ్యర్థులు తెచ్చిన అప్పులను, రాజకీయ భవిష్యత్తును తలుచుకుంటూ వేదన పడుతున్నారు.






