- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థాయిలాండ్, మయన్మార్ లో చిక్కుకున్న తెలుగు యువతకు విముక్తి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నకిలీ ఉద్యోగాల పేరిట మోసపూరితంగా థాయిలాండ్ - మయన్మార్ దేశాలకు రవాణా కాబడి అష్టకష్టాలు పడుతున్న తెలుగు రాష్ట్రాల యువతకు ఎట్టకేలకు విముక్తి కలిగింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నకిలీ ఉద్యోగాల పేరిట మోసపూరితంగా థాయిలాండ్ - మయన్మార్ దేశాలకు రవాణా కాబడి అష్టకష్టాలు పడుతున్న తెలుగు రాష్ట్రాల యువతకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. కేంద్ర విదేశాంగ శాఖ ఈ విషయంలో తీసుకున్న సమర్థవంతమైన చర్యల ఫలితంగా మోసానికి గురైన యువత రక్షణ దొరికింది. ఆకర్షణీయమైన వేతనాల ఆఫర్లతో కొందరు ఏజెంట్లు మోసం చేసి భారత దేశం నుంచి 2,545 మందిని థాయిలాండ్ - మయన్మార్ దేశాలకు పంపించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 316 మంది బాధితులున్నారు. థాయిలాండ్ - మయన్మార్ దేశాల సరిహద్దు ప్రాంతాలైన టాచిలేక్, ష్వే కొక్కో, మయావాడీ ప్రాంతాల్లో అక్రమంగా తరలించిన భారతీయ యువతతో బలవంతంగా సైబర్ నేరాలకు సంబంధించిన పనులు చేయిస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
లోక్ సభలో ప్రస్తావించిన ఎంపీ అర్వింద్..
నకిలీ ఉద్యోగాల పేరిట మోసానికి గురైన యువత అంశాన్ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఇటీవల లోక్ సభలో రూల్ 377 కింద ప్రస్తావించారు. అక్రమ రవాణాకు గురైన యువకులు అక్కడ పడుతున్న అవస్థలపై, వారిచేత చేయిస్తున్న చట్టవ్యతిరేక పనులపై అర్వింద్ ధర్మపురి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ,బాధిత యువతకు విముక్తి కలిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై సాయం కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ఫిర్యాదు కూడా చేశారు. ఎంపీ అర్వింద్ అభ్యర్థన, ఫిర్యాదుపై విదేశాంగ శాఖ స్పందించింది.
2,390 మంది భారతీయులకు విముక్తి..
థాయిలాండ్ మయన్మార్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల గురించి ఎంపీ అర్వింద్ లోక్ సభలో స్తావించిన అంశంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించింది. అక్రమ తరలింపుకు గురైన 2,390 మందికి విముక్తి కలిగించి రక్షించింది. విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 2,545 మంది భారతీయులు అక్రమంగా తరలించబడినట్లు గుర్తించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుండి 316 మంది బాధితులున్నారు. భారత విదేశాంగ శాఖ విముక్తి కలిగించిన 2,390 మంది బాధితుల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 297 మంది ఇప్పటికే రక్షింప బడినట్లు ఎంపీ కార్యాలయం ప్రకటించింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.






