ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల టెన్ష‌న్..సెంచ‌రీ దాటిన‌ పులుల సంఖ్య !

by velandi.Saikiran |   (  Updated:2026-03-16 21:31:18  IST  )

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాతో కలుపుకుని చిరుతల సంఖ్య వందకు పైగానే ఉండి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెపుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల టెన్ష‌న్..సెంచ‌రీ దాటిన‌ పులుల సంఖ్య !
X

గ్రామాల్లో చిరుతల సంచారం

భయంతో బిక్కుబిక్కుమంటున్న జనం

తరచూ పశువులపై దాడులు చేస్తున్న చిరుతలు

చిరుతల సంఖ్య పెరిగిందంటున్న అధికారులు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో అటవీ సమీప గ్రామాల పరిధిలో ఇటీవల కాలంలో చిరుతల సంచారం ఎక్కువైంది. దీంతో ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొంతకాలంగా చిరుతల సంఖ్య జిల్లాలో పెరగిందని అధికారులంటున్నారు. గతంలో ఎప్పుడో ఒక చోట చిరుతల అలికిడి క(వి)నిపించేదని, ఈ మధ్య కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రత్యేకించి ఒక ఫారెస్ట్ రేంజ్ లో అని కాకుండా ఏ రేంజ్ లో పడితే ఆ రేంజ్ లో చిరుతల సంచారం కనిపిస్తుంది. కొద్ది రోజులుగా చిరుతల అలికిడి మరీ ఎక్కువైంది. తరచూ ఎక్కడో చోట చిరుతపులులు పశువులపై దాడి చేసి చంపిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క చిరుతలే రైతులను, పశు పోషకులను, అటవీ సమీప గ్రామాల్లో ఉండే జనాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయంటే తాజాగా, ఓ పెద్ద పులి కూడా కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవక్క పేట్ అడవుల్లో కనిపించి గుబులు రేపింది.

దాదాపు పది రోజుల పాటు ఈ ప్రాంతంలోనే తిరిగి ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధి దాటి వెళ్లిపోయినట్లు అధికారులు చెపుతున్నారు. ఇటీవల కాలంలో నల్‌లగొండ అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులే కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ లో కనిపించినట్లు అధికారులు చెపుతున్నారు. కొద్ది నెలల క్రితం కూడా పెద్దపులి (ఎస్ 12) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులకు, అటవీ సమీప గ్రామాల ప్రజలకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఓ పక్క అధికారులు పెద్దపులి (ఎస్ 12) కోసం ఓ పక్క పెద్ద ఎత్తున వేట ప్రారంభించినప్పుడే గుట్టుచప్పుడు కాకుండా పశువులపై దాడులు చేసి చంపి అందరికీ చెమటలు కక్కించింది. చివరగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి (ఎస్ 12) అక్కడి నుండి అదృశ్యమైంది. అక్కడి నుంచి ఎక్కడి వెళ్లిపోయిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది. పెద్దపులి (ఎస్ 12) పై విష ప్రయోగం చేసి అటవీ సమీప గ్రామస్థులు కొందరు చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో అధికారులకు కూడా పెద్దపులి అదృశ్యం విషయం పక్కాగా సమాచారం లేకుండా ఇప్పటికీ మిస్టరీగానే మారింది.

సెంచరీ దాటాయంటున్న అధికారులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంఖ్య బాగా పెరిగినట్లు అధికారులు చెపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 60 నుండి 70 వరకు ఉండొచ్చని, కామారెడ్డి జిల్లాతో కలుపుకుని వీటి సంఖ్య వందకు పైగానే ఉండి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మంచిప్ప ప్రాంతం, ఇందల్వాయి, కమ్మర్ పల్లి, పెద్దగుట్ట, సారంగపూర్, అలీసాగర్ తదితర ప్రాంతాల్లోనే దాదాపు 10 నుంచి 15 వరకు చిరుత పులులున్నట్లు తెలుస్తోంది. అడవులన్నీ పచ్చదనంతో ఉండటం, అడవుల్లో గతంలో మాదిరిగా వేటగాళ్లు వన్యమృగాలను వేటాడం తగ్గడం, జింకలు, దుప్పిల సంఖ్య పెరగడం వంటి అనుకూలాంశాల కారణాలతో చిరుతపులులకు ఆహారం కు కొదవ లేకుండా పోయింది.

చిరుత పులులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుమార్లు జాతీయ రహదారిని దాటుతూ వేగంగా వస్తున్న భారీ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో పలు చిరుతలు చనిపోయిన దాఖలాలు కూడా జిల్లా పరిధిలో ఉన్నాయి. గతంలో ఇందల్వాయి , సదాశివనగర్ ల మధ్య రాత్రి సమయంలో జాతీయ రహదారి దాటుతూ ఓ చిరుతపులి వేగంగా వస్తున్న భారీ వాహనం ఢీకొనడంతో మృత్యువాతకు గురైంది. చిరుతలు ఇటీవల కాలంలో అటవీ సమీప గ్రామాలకు చెందిన పశువులపై దాడి చేస్తూ చంపుతున్నాయని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. చిరుత పులులు కనిపించిన ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుత పులులు సంచరించే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో అటవీ సమీప ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు.

Next Story