- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి అభివృద్ధికి నా తుదిశ్వాస వరకు పాటుపడతా : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి అభివృద్ధికి నా తుది శ్వాస వరకు పాటు పడతానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం తన నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి అభివృద్ధికి నా తుది శ్వాస వరకు పాటు పడతానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం తన నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు. కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడం కోసం గతంలోనే 120 కిలోమీటర్ల దూరం నుండి గోదావరి జలాలను తీసుకువచ్చానని గుర్తు చేశారు. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి మళ్లీ కామారెడ్డికి నీటి కష్టాలు తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో రూ.1.35 కోట్లతో సీసీ రోడ్లు, పార్కు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డికి 25 ఏళ్ల వరకు నీటి కష్టాలు రాకుండా నేను ఎంతో కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమృత్ పథకం కింద రూ. 200 కోట్లు మంజూరు చేయించామని, దీనివల్ల రాబోయే 25 ఏళ్ల వరకు కామారెడ్డి పట్టణానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ పేరు కోసం పనిచేయలేదని, ప్రజల కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన రెండేళ్లుగా ఎమ్మెల్యే సహకారం కోసం వేచి చూశానని, కానీ ఆయనకు అభివృద్ధి కంటే ప్రోటోకాల్‌పైనే ఎక్కువ ధ్యాస ఉందన్నారు.
అభివృద్ధి చేసి చూపిస్తా..
అభివృద్ధి జరుగుతున్న చోట 14 గ్రామాలపై విజిలెన్స్ విచారణకు ఫిర్యాదు చేయడం ఆయన వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు. అధికారులు శంకుస్థాపనల కోసం సమయం అడిగితే మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నానని చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, ఆయన నియోజకవర్గం కొడంగల్‌కు ఇచ్చే నిధుల్లో సగం అయినా కామారెడ్డికి ఇవ్వాలని కోరానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించి కొడంగల్‌తో సమానంగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని షబ్బీర్ అలీ వెల్లడించారు. ఇక్కడ ప్రజలు మాజీ సీఎం కేసీఆర్‌ను ఓడించారని, ప్రస్తుత సీఎంను మూడో స్థానంలో నిలిపినా కానీ అభివృద్ధి మాత్రం ఆగదన్నారు. తనను శిలాఫలకాలు వేయనివ్వకపోయినా, అడ్డంకులు సృష్టించినా కామారెడ్డిని అభివృద్ధి చేసి తీరుతా అని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పదవిలో ఉన్నప్పటికీ, తన సొంత గడ్డ అయిన కామారెడ్డి అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడతానని షబ్బీర్ అలీ పునరుద్ఘాటించారు.






