చిన్నపాటి వర్షానికే చిత్తడి అయిన కామారెడ్డి రోడ్లు

by Bhanu |

భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయంటే వరదలకు నీరంతా రోడ్లపైకి వచ్చి పారుతుండడం సహజమే.

చిన్నపాటి వర్షానికే చిత్తడి అయిన కామారెడ్డి రోడ్లు
X

దిశ, కామారెడ్డి : భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయంటే వరదలకు నీరంతా రోడ్లపైకి వచ్చి పారుతుండడం సహజమే. కానీ చిన్నపాటి చిరు జల్లులకే రోడ్లన్నీ చిత్తడి అయి రోడ్లపై మురుగు నీరు పారుతుందంటే మున్సిపల్ అధికారులు, సిబ్బంది పనితీరును అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి మురుగు కాలువలు పొంగి రోడ్లపై మురుగు నీరు ఏరులై పారింది. రోడ్లపై వెళ్లే వాహనదారుల తో పాటు పాదచారులు దుర్వాసనతో ఇబ్బందులకు గురయ్యారు. అశోక్ నగర్, సాయిబాబా గుడి రోడ్, నిజాంసాగర్ రోడ్డు, సిరిసిల్ల రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి.

మురుగు కాలువలు శుభ్రం లేకనే...

మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లనే చిన్నపాటి వర్షానికి మురుగునీరు అంతా రోడ్లపై ప్రవహించింది. రానున్నది వర్షాకాలమే అయినందున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలోని మురుగు కాలువలు అన్నింటిని శుభ్రం చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

రోడ్లపై గల గుంతలను వెంటనే పూడ్చి వేయాలి...

కామారెడ్డి పట్టణంలోని పలు రోడ్లలో ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేసి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రానున్నది అసలే వర్షాకాలం కావడంతో వర్షాలకు నీరంతా రోడ్లపై ప్రవహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రోడ్లపై ఉన్న గుంతలు వర్షపు నీటితో ఏర్పడక వాహనదారులు, పాదచారులు అందులో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలను పూడ్చివేయాలని కోరుతున్నారు.

Next Story