సద్దుమణిగిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ...

by Taduka Kalyani |

గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన కామారెడ్డి కాంగ్రెస్ అంతర్గత వివాదం హైదరాబాదులోని గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎట్టకేలకు తెరపడింది.

సద్దుమణిగిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ...
X

దిశ, కామారెడ్డి : గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన కామారెడ్డి కాంగ్రెస్ అంతర్గత వివాదం హైదరాబాదులోని గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎట్టకేలకు తెరపడింది. ఆదివారం గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో ఈ వివాదం ముగిసింది. ఈ పంచాయితీలో కామారెడ్డి కి చెందిన షబ్బీర్ అలీ, చంద్రశేఖర్‌రెడ్డి లు మనస్పర్తలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు మానేసి పరస్పరం చేతులు కలిపి ఇద్దరూ కలిసి పనిచేసేందుకు అంగీకరించారు.

సుదీర్ఘ మంతనాలతో ఒకటైన నేతలు

కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిల మధ్య నెలకొన్న అంతర్గత వివాదం పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉండటానికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇరువర్గాల నేతలతో సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా కమిటీ ఇరువురు నేతలకు పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, కాంగ్రెస్ బలోపేతం కోసం, పార్టీ ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేసింది. నియోజకవర్గంలో పార్టీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, వాటిని అంతర్గతంగా హైకమాండ్ దృష్టికి తీసుకురావాలే తప్ప, బహిరంగ విమర్శలు చేయకూడదని సూచించింది. పార్టీ నేతలు తమ పరిధిలోని వివాదాల కోసం పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగడం సరికాదని, దీనివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై త్వరలో చర్చ

షబ్బీర్ అలీ గతంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై తదుపరి సమావేశాల్లో సమగ్రంగా చర్చిస్తామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల నేతలను సముదాయించడం జరిగిందని, షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై త్వరలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఆడియో టేపులపై షబ్బీర్ అలీ వివరణ

కాగా ఈ వివాదంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఆడియో టేపుల వ్యవహారంపై ఆయన స్పందించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియో టేపులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని షబ్బీర్ అలీ కమిటీకి స్పష్టం చేశారు. ఆ వాయిస్ తనది కాదని ఆయన ఖండించారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి, తన ప్రతిష్ఠను దిగజార్చడానికి కొందరు ప్రత్యర్థులు కావాలనే కుట్ర పూరితంగా ఈ ఆడియోను సృష్టించి వైరల్ చేశారని కమిటీ ఎదుట తెలిపారు.

కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం

కామారెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, చంద్రశేఖర్‌రెడ్డిలు అంతర్గత విభేదాలు మానుకొని పార్టీ కోసం కలిసి పని చేస్తామని చేతులు కలపడంతో కామారెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గత కొన్ని రోజులుగా కామారెడ్డిలో ఇరువర్గాల నేతల పరస్పర మాటల యుద్ధాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొన్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ ఎదుట ఇరువర్గాల నేతలు వైశామ్యాలను పక్కన పెట్టి కలిసిపోయి స్వీట్లు పంచుకోవడంతో స్థానిక కాంగ్రెస్ నేతల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

Next Story