మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

by Ratna Kumari |

తెలంగాణ‌లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి లక్ష్మీ నర్సాగౌడ్ తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ
X

దిశ, కామారెడ్డి : తెలంగాణ‌లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి లక్ష్మీ నర్సాగౌడ్ తెలిపారు. మంగళవారం హౌసింగ్ బోర్డు కాలనీలోని పార్టీ కార్యాలయంలో పలువురు అభ్యర్థులు జనసేన పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు తెలంగాణలో జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. కామారెడ్డి మున్సిపల్ లో 15 నుంచి 16 వార్డుల్లో జనసేన పోటీలో ఉంటుందని.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు గట్టి పోటీ ఇస్తుందని తెలిపారు. వార్డుల్లో సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టో తయారు చేస్తామని తెలిపారు. కొండగట్టుకు పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించిన తర్వాత తెలంగాణలో పార్టీకి బలం పెరిగిందని, పార్టీపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 9 వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకుని పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ ఇస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి షాకులు తగులుతున్నాయని, ఆ పార్టీల నుంచి జనసేనలోకి వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కామారెడ్డిలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, రవి, శరత్, మల్లేశం, జీవన్, దినేష్ పాల్గొన్నారు.

Next Story