Finance Ministry: ఎల్ఐసీ, ఈపీఫ్ఓ నిధులపై కేంద్రం క్లారిటీ

by S Gopi |

2024, జూన్ 19న ఐఆర్‌డీఏఐ జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ ప్రకారం 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని బీమా మొత్తాలను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేస్తారు.

Finance Ministry: ఎల్ఐసీ, ఈపీఫ్ఓ నిధులపై కేంద్రం క్లారిటీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన నిధులు, అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లోని నిధులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ డబ్బును ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం కాకుండా వేరే ఏ ప్రయోజనానికి వినియోగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. 2024, జూన్ 19న ఐఆర్‌డీఏఐ జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ ప్రకారం 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని బీమా మొత్తాలను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేస్తారు. ఈ విధానంలో ఎలాంటి మార్పు చేసే ప్రతిపాదన లేదని మంత్రి తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎల్ఐసీ వద్ద మొత్తం రూ.7,318.50 కోట్ల క్లెయిమ్ చేయని నిధులు ఉన్నాయి. ఇందులో పాలసీదారులకు చెల్లించాల్సిన రూ.5,564.55 కోట్లు, వాటిపై వచ్చిన ఆదాయం రూ.1,753.95 కోట్లు ఉన్నాయి. మరోవైపు, ఈపీఎఫ్ఓలో 'అన్‌క్లెయిమ్ అకౌంట్లు ' అనే విభాగం లేనప్పటికీ, ఎక్కువకాలం క్లెయిమ్ చేయని నిధులు రూ.9,330.56 కోట్లు ఉన్నాయని మంత్రి వివరించారు.

ఈ నిధులు అసలు లబ్ధిదారులకే చేరేలా ఎల్ఐసీ, ఈపీఎఫ్ఓ చర్యలను తీసుకుంటున్నాయి. పాలసీదారులు తమ క్లెయిమ్ చేయని మొత్తాలను ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకునే అవకాశం కల్పించగా, మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు, స్థానిక ఏజెంట్లు, బీమా సఖీలు, క్రెడిట్ బ్యూరోల సహాయంతో లబ్ధిదారులు, నామినీలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈపీఎఫ్ఓ కూడా కేవైసీ ఆధారంగా రూ.1,000 లేదా అంతకంటే తక్కువ నిల్వ ఉన్న అకౌంట్లలోని మొత్తాన్ని కొత్త క్లెయిమ్ లేదా అదనపు పత్రాలు అవసరం లేకుండా నేరుగా ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే పైలట్ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే ఆమోదం పొందింది. అలాగే సోషల్ మీడియా, 'నిధి ఆప్కే నికత్ 2.0' ద్వారా చందాదారులు తమ డబ్బును గుర్తించి తిరిగి పొందేలా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

Next Story