- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాం షుగర్స్ మూతపడి పదేళ్లు..
నష్టాల సాకుతో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడి పదేళ్లు పూర్తయ్యాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నష్టాల సాకుతో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడి పదేళ్లు పూర్తయ్యాయి. చెరుకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రతిపక్షాలు, ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నేతలు, వారికి మద్దతుగా అన్ని వర్గాలు ఆందోళనలు జరిపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. బోధన్ లో నెలల తరబడి నిరాహార దీక్షలు చేసినా పాలకుల మనసు కరగలేదు. ఫ్యాక్టరీకి వేసిన తాళం ఊడలేదు. దీంతో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వర్గాలు ఎందరో రోడ్డుమీదికి వచ్చారు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ఏయేడు కాయేడు ఫ్యాక్టరీని తెరిపిస్తారని ఆశతోనే జీవిస్నున్న ఫ్యాక్టరీ ఆధారిత కుటుంబాలకు, చెరకు రైతులకు పదేళ్లు నిరాశతోనే గడిచిపోయాయి. పదేళ్ల క్రితం డిసెంబర్ 23, 2025 రోజున అర్ధరాత్రి నష్టాల సాకుతో అప్పటి ప్రభుత్వం ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీ గేట్లకు తాళం వేసి సీల్ వేసింది. ఇది జరిగి పదేళ్లు నిండాయి.
వంద రోజుల్లో తెరిపిస్తానన్న హామీ నెరవేరలేదు..
ఎంపీగా తనను గెలిపిస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న కల్వకుంట్ల కవిత ఎలక్షన్ లో ఎంపీ గా గెలిచినా తన హామీని నిలుపుకోలేకపోయారు. 2014 బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని కేసీఆర్, ఆమె కూతురు కల్వకుంట్ల కవితలు నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. చెరుకు రైతుల జీవతాల్లో వెలుగులు తీసుకొస్తామని నమ్మించారు. కానీ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారు. తన తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్నా, పట్టుబట్టి ఫ్యాక్టరీ తెరిపించగలిగే సామర్థ్యం, అవకాశం కవితకు ఉన్నప్పటికీ ఎందుకనో ఆమె బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారు. ఫ్యాక్టరీ అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడుకుని ఎలక్షన్ లో లబ్ధి పొందారే తప్ప షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, చెరకు రైతులకు ఫ్యాక్టరీ ఆధారిత జీవులకు ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒట్టు తీసి గట్టుమీద పెట్టేసిన సీఎం..
మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామన్న కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకోలేరని, అబద్దాలు చెప్పి నిజామాబాద్ లో గెలిచిన కవిత హామీలు నిలబెట్టుకోలేదని కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి బోధన్ సభలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని బోధన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ హోదాలో ప్రజలకు హామీ ఇచ్చారు. బోధన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని, ఫ్యాక్టరీని తెరిపిస్తానని అందరు దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్టు వేసి మరీ గట్టిగా హామీ ఇచ్చారు.
సుదర్శన్ రెడ్డిని గెలిపించినా..
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మిన ప్రజలు ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డిని గెలిపించారు. అసెంబ్లీకి పంపించారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారాన్ని కూడా కట్టబెట్టారు. కానీ ఇప్పటికీ ఇంకా షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. ఎన్నికల ప్రచారంలో సుదర్శన్ రెడ్డిని అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ ను సుదర్శన్ రెడ్డితో పోలుస్తూ షకీల్ సుదర్శన్ రెడ్డి కాలిగోటికి షకీల్ సరిపోడని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్‌టరీ తెరిపిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. బోధన్ ప్రచార సభలో హామీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు అయ్యారు. మంత్రి కాని మంత్రి హోదాలో అధికారాన్ని చెలాయిస్తున్నారు. కానీ చెరుకు ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాత్రం అడుగు ముందుకేయలేక పోతున్నారు.






