- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తాడ్వాయి: ఆకాశం నుంచి పడుతున్న పసుపు రంగు చుక్కలు ఎర్రపహడ్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొదట ఏదో యాధృచ్ఛికం అనుకున్నా.. మెల్లమెల్లగా ఈ ఎల్లో డ్రాప్స్ విస్తరించడం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తున్నది. అసలు ఈ రంగు ఎక్కడి నుంచి వస్తున్నది? ఇది ప్రకృతి వైపరీత్యమా? లేక పరిశ్రమల విషమా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. గత కొన్ని రోజులుగా గ్రామంలోని ఒకే కాలనీలోని గుడి, పదిహేను ఇండ్ల పరిసరాల్లోని చెట్ల ఆకులు, ఆరేసిన దుస్తులపై చిక్కటి పసుపురంగు ద్రవం చుక్కలు చుక్కలుగా పడుతున్నది. బయటకు చెబితే ఎవరైనా నవ్వుతారేమోనని ఇన్నాళ్లు భయపడ్డస్థానికులు.. ‘దిశ’లో వచ్చిన కథనంతో ఒక్కొక్కరుగా గొంతువిప్పుతున్నారు.
పీహెచ్ సీకి బాధితులు
ఈ మిస్టరీ చుక్కల భయంతో బాధిత కుటుంబాల వారు సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యుడిని కలిశారు. తమ ఇళ్లపై పడుతున్న ఆ పసుపు రంగు ద్రవం తాలూకు వివరాలను వివరించి, ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ 'ఎల్లో డ్రాప్స్' నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపించి అవి ఏమిటో శాస్త్రీయంగా నిర్ధారించాలని కోరారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలిలో కలిసి ఇలా పడుతున్నాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చుక్కలు ఏమైనా ఇన్ ఫెక్షన్లు కలిగిస్తాయా? బావుల్లోని నీరు, పంటలపై, బయట ఉన్న పశువుల మేతపై ఈ చుక్కల ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీబీ, ఆరోగ్యశాఖ అధికారులు వీటి నమూనాలు సేకరించి గుట్టు విప్పాలని గ్రామస్తులు కోరుతున్నారు.






