కోర్సుతో సంబంధం లేకుండా టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి : ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి

by Ratna Kumari |

ప్రతీ విద్యార్థి బీఏ, బీకాం, బీఎస్సీ అనే తేడా లేకుండా టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి సూచించారు.

కోర్సుతో సంబంధం లేకుండా టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి :  ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి
X

దిశ, కామారెడ్డి : ప్రతీ విద్యార్థి బీఏ, బీకాం, బీఎస్సీ అనే తేడా లేకుండా టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు అనే అంశంపై జరిగిన సెమినార్ కు ఆయ‌న‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం పై పూర్తి అవగాహన కలిగి బాధ్యతతో ఉండాలని సూచించారు. నేడు భారతదేశం ప్రపంచంతో ముఖ్యంగా అమెరికా లాంటి ఉన్నత స్థాయి దేశాలతో పోటీపడుతోందని, రాకెట్ లాంచింగ్ లో సైతం అమెరికాను దాటి ముందుకు వెళ్తోందని, విద్యార్థులు సైతం పోటీలో ముందుండి అద్భుత అవకాశం అందుకోవాలన్నారు. చదువుతూ తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్కే డిగ్రీ కళాశాల 24 సంవత్సరాలుగా అనేకమంది విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించిందన్నారు. వచ్చే సంవత్సరం 25వ వసంతంలో అడుగుపెట్టి రజతోత్సవానికి సిద్ధమవుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్ రావు, దత్తాత్రి, డీన్ నవీన్, ప్రిన్సిపాల్స్ గోవర్ధన్ రెడ్డి, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, నరేష్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Next Story