ఇందూరులో యథేచ్ఛగా అంతర్రాష్ట్ర ముఠాల చోరీలు!

by Malleboina Mahesh |

నిజామాబాద్ నగరంలో వరుస దొంగతనాలు సర్వసాధారణమై పోయాయి. చైన్ స్నాచింగులు, తాళం వేసిన ఇళ్లలో చోరీలు, ఏటీఎం లూటీలు జనాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇందూరులో యథేచ్ఛగా అంతర్రాష్ట్ర ముఠాల చోరీలు!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో వరుస దొంగతనాలు సర్వసాధారణమై పోయాయి. చైన్ స్నాచింగులు, తాళం వేసిన ఇళ్లలో చోరీలు, ఏటీఎం లూటీలు జనాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాకిట్లో కల్లాపి జల్లి ముగ్గులేస్తున్న మహిళలు, పూజ కోసం ఇంటి బయట చెట్టుకు పూలు కోస్తున్న మహిళల మెడలో చైన్లను కూడా దొంగలు తెంపుకుని ఎత్తుకెళుతున్నారు. మహిళలు ఒంటరిగా రోడ్లపై నడవాలంటేనే దడుచుకునే పరిస్థితులు నగరంలో ఉన్నాయని మహిళలు వాపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు రెక్కీలు నిర్వహించి మరీ ఇళ్లను దోచేస్తున్నారు. వీటికి తోడు ఏటీఎం లూటీలు కూడా ఎక్కువవడం, నిమిషాల వ్యవధిలోనే పలు చోట్ల సునాయసంగా ఏటీఎంలు లూటీ చేసే ముఠాలు నగరంలోకి ఎంటర్ కావడం తో మరికొన్ని దొంగతనాలు చూడాల్సి వస్తుందోనని నగర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

నిమిషాల వ్యవధిలో రెండు ఏటీఎంల లూటీ..

ఈనెల 27న తెల్లవారుజామున నిజామాబాద్ నగరంలో నిమిషాల వ్యవధిలోనే ఐదుగురు గుర్తుతెలియని దుండగులు రెండు చోట్ల ఏటీఎంలను లూటీ చేసి దగ్ధం చేశారు. వర్ని చౌరస్తాలోని ఎస్‌బీఐ ఏటీఎంను తెల్లవారుజామున 3.12గంటలకు లూటీ చేసి, 3.22గంటలకు ఆర్య నగర్, బ్యాంక్ కాలనీలోని డీసీబీ ఏటీఎంను లూటీ చేశారు. ఈ రెండు ఏటీఎంలను దుండగులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఏటీఎంను తెరిచి లూటీకి పాల్పడ్డారు. దొంగతనాలే ప్రధాన వృత్తిగా జీవించే హర్యానాలోని యేవత్ ప్రాంతానికి చెందిన దొంగలుగా ఇందూరు పోలీసులు అనుమానిస్తున్నారు.

కొద్ది రోజుల కింద నగరంలోని ఓ కాలనీలో తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును చైన్ స్నాచర్ తెంపుకెళ్లాడు. తాజాగా సుభాష్ నగర్‌లో ఓ మహిళ పూలు తెంపుకుంటుండగా ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి ఆ మహిళ మెడలోని గోల్డ్ చైన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. చైన్ స్నాచింగ్ కేసులు నిజామాబాద్ నగరంలో షరా మామూలైపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల నిఘా ఏమైనట్లు?

నేరాల నియంత్రణలో పోలీసులది ప్రధాన పాత్ర. పోలీసులు లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడమే కాదు. అనేక రకాల నేరాలు, ఘోరాలు జరుగుతాయి. పోలీసు వ్యవస్థ సరిగా పని చేయకపోతే దొంగతనాలు, దోపిడీలు కూడా పెచ్చు మీరుతాయి. నిజామాబాద్ నగరం పోలీసుల నిరంతర నిఘాలోనే ఉంటుందని పోలీసులు చెపుతున్నా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయో, ఈ దొంగతనాలు ఎందుకు అరికట్టలేకపోతున్నారో అంతుబట్టని పరిస్థితి. నగరంలో ప్రధాన కూడళ్లలో పోలీసులు ఎక్కువగా కనిపిస్తున్నారు.

వాహన తనిఖీలు, నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని జరిమానాలు వేయడం, వేలాది రూపాయలు ఫైన్ లు వేయడం వంటి పనుల్లో పోలీసులు బిజీగా ఉన్నారు. ఫోకస్ అంతా ఒక వైపే పెట్టి దొంగతనాల విషయంపై ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నప్పటికీ నగరంలో దొంగతనాలెందుకు జరుగుతున్నాయో, చైన్ స్నాచింగులు, ఏటీఎం లూటీలెందుకు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి.

పోలీసుల దృష్టి వాహనాల తనిఖీలు, ఫైన్ల పైనేనా?

మునుపెన్నడూ లేని రీతిలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. రాత్రనకా, పగలనకా ప్రధాన కూడళ్లలో, వివిధ రహదారులపై నా వెహికిల్ చెకప్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నారు. ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. రూ.వేలల్లో ఫైన్లు రాస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిని జైళ్లకు కూడా పంపిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 26 వరకు (వారం రోజుల్లో) జిల్లాలో 129 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, రూ.8.80లక్షల జరిమానాలు విధించారంటే పోలీస్ శాఖ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై ఎంత ఫోకస్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ పెట్రోలింగ్‌ను ఇంకా పెంచాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story