ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వెనకడుగు

by Muthe.Rajitha |

పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలో చాలా మంది నిర్మించుకోవడానికి ఇష్ట పడటం లేదు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వెనకడుగు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలో చాలా మంది నిర్మించుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఇంటి నిర్మాణం తమ అవసరాలకు అనుగుణంగా సరిపోదని, దీంతో తాము ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోలేమని జిల్లాలో లబ్ధిదారులు వెనకడుగు వేస్తున్నారు. తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా నిర్మించుకునే ఆలోచనలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన స్థలాని కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలు పొందేందుకు లబ్ధిదారులకు అవకాశం ఉండదని ప్రభుత్వం పేర్కొనడంతో చాలా మంది ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు. తాము ఇంటి నిర్మాణం చేసుకోలేమని అధికారులకు లిఖిత పూర్వకంగా రాసిస్తున్నారు. దీంతో పాటు ఆర్థికంగా డబ్బులు సర్దుబాటు కాకపోవడం కూడా కొంత మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారు.

భార్యా, భర్తలు, చిన్న పిల్లలున్న కుటుంబాలు తమకు మంజూరైన ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ, పిల్లలు పెద్దగా ఉన్న కుటుంబాలు మాత్రం ఇందిరమ్మ ఇళ్లు తమ అవసరాలకు సరిపోదని, ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇంటి నిర్మాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. తమకు మంజూరైన ఇంటిని వదులుకుంటున్నారు. వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు జిల్లాలో ఆశించినంత వేగంగా జరగడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని, గైడ్ లైన్స్ ప్రకారమే నిర్మాణాలు జరగాలనే ప్రభుత్వ నిబంధన పేదల సొంతింటి కలకు అవరోధంగా నిలుస్తోందని కొందరంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో 19306 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 17525 ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. జిల్లాలోని ఆర్మూర్‌లో 3252, బోధన్‌లో 3545, నిజామాబాద్ అర్బన్ 1527, నిజామాబాద్ రూరల్‌లో 3673, బాల్కొండ నియోజకవర్గంలో 3629 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 8838 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. లక్ష్యానికి అనుగుణంగా ఇంకా 2221 ఇళ్లు మంజూరు కావాల్సి ఉన్నాయి. మంజూరైన వాటిలో ఇప్పటి వరకు 4633 ఇళ్ల నిర్మాణాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. వాటిలో బేస్మిట్ లెవెల్‌లో 3966 ఇళ్లు, గోడల స్థాయిలో 457, పై కప్పు స్థాయిలో 457 ఇళ్లున్నాయి.

జిల్లా సమాఖ్య నుంచి రూ.24,75కోట్ల రుణ సాయం..

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నుండి జిల్లా సమాఖ్య ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అవసరాన్ని బట్టి రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 2418 మందికి రూ. 27.56 కోట్లు రుణాన్ని అందజేశారు. వీటిలో రూరల్ ఏరియాలో 2137 మంది లబ్దిదారులకు ఇప్పటి వరకు రూ. 24.75 కోట్లు రుణాన్ని మంజూరు చేయగా, అర్బన్ ఏరియాలో 281 మందికి రూ.2.81 కోట్లు మంజూరు చేశారు.

మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క అధికారులతో రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్టారెడ్డి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సానుకూల, ప్రతికూల అంశాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన దశల వారీగా జరిగే నిర్మాణం పనుల చెల్లింపులు సక్రమంగానే జరుగుతున్నాయని వివరించారు. ప్రతి గురువారం రిజిస్ట్రేషన్ చేశాక, ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. కానీ, చాలా మంది ఇందిరమ్మ ఇళ్లు తమ అవసరాలకు సరిపోవడం లేదనే అభిప్రాయంతో ఇంటి నిర్మాణం విషయంలో వెనకడుగు వేస్తున్నారని కలెక్టర్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తిచేయించే విషయంలో కలెక్టర్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆశించిన ప్రగతి మాత్రం కనిపించకపోవడం అధికారులను నిరుత్సాహానికి గుర్తి చేస్తోంది. ఇంటి విస్తీర్ణంలో నిబంధలను సడలిస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో పరుగులు పెట్టే అవకాశాలున్నాయని కొందరు అధికారులు ఆఫ్ ది రికార్‌డ్ గా చెపుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని లబ్దిదారులు, గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.

Next Story