- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లెల్లో పెద్దల పెత్తనం..తీర్పులు, తీర్మానాలతో ఆధిపత్యం
నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీల) ఆగడాలు రోజురోజుకూ శృతి మించిపోతున్నాయి.

దిశ,ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీల) ఆగడాలు రోజురోజుకూ శృతి మించిపోతున్నాయి. ప్రధానంగా జిల్లాలోని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ లో గ్రామ కమిటీ ఆగడాలకు హద్దే లేకుండా పోతుంది. చాలా ఏళ్లుగా గ్రామ అభివృద్ధి కమిటీలు పెద్దరికం పేరిట ఏకవాక్య తీర్పులు, తీర్మానాల పేరిట తీర్పులు చెపుతూ వాటిని ధిక్కరించే వ్యక్తులపై, కుల సంఘాలపై బహిష్కరణలతో వేటు వేస్తున్నాయి.
గ్రామాల్లోని ప్రతి కుల సంఘం నుండి ఒక్కో సభ్యుడు చొప్పున గ్రామాభివృద్ధి కమిటీలో ఉంటారు. ఈ సంప్రదాయం ప్రతి గ్రామంలో కొనసాగుతోంది. గ్రామ అభివృద్ధి పేరుతో ఏర్పడిన వీడీసీల అసలు లక్ష్యాలను విస్మరించి ఏకవాక్య తీర్పులు, తీర్మానాలు బెదిరింపు ధోరణులతో ఆదాయాలను సమకూర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను సైతం పక్కనపెట్టి పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా సమాంతర పాలన సాగిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. గ్రామ ఐక్యత, అభివృద్ధి ఎజెండాల ముసుగులో గ్రామాల్లో ఏర్పాటైన గ్రామాభివృద్ధి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ కమిటీ తీర్పులను ప్రశ్నించే వ్యక్తులను, కమిటీ తీర్మానాలను ధిక్కరించిన వారిని కుల బహిష్కరణ, సాంఘీక బహిష్కరణ వేటు వేస్తున్నారు. మానసిక, సామాజిక వేధింపులకు గురి చేస్తూ , అడ్డగోలుగా జరిమానాలు విధిస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు అంతా గ్రామాభివృద్ధి కమిటీల ముందు డమ్మీలుగా మారిపోతున్నారు. పల్లెల్లో వీడీసీల ఆధిపత్యం ముందు ప్రజాప్రతినిధులే చిన్నబోతున్నారు. పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీలు అన్నీ తామై వ్యవహరిస్తూ ప్రజా ప్రతినిధులను సైతం శాసించే స్థాయికి చేరుకున్నాయి. వీడీసీల ముందు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు నామ్ కే వాస్తేగా మారిపోయారు. వీడీసీల తీర్పులు, తీర్మాణాలకు ప్రజాప్రతినిధులు సైతం అడ్డుచెప్పే పరిస్థితులు లేవు. సాధారణంగా పల్లెల్లో ఎన్నికల సమయంలో సైతం వీడీసీల కటాక్షం కోసం అన్ని పార్టీల నాయకులు క్యూలు కట్టే పరిస్థితులున్నాయి.
దీంతో వీడీసీల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
ఆదాయ వనరులపై వీడీసీల నజర్..
జిల్లాలోని అన్ని పల్లెల్లో వైన్ షాప్ లకు సంబంధించిన పర్మిట్ రూములు లేదా బెల్ట్ షాపుల నిర్వహణకు వీడీసీల పరోక్ష మద్దతే కారణమన్న చర్చ జోరుగా సాగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో పర్మిట్ రూములు, పల్లెల్లో బెల్ట్ షాపులను ఏర్పాటు చేసేందుకు బహిరంగ వేలం పాటలను వీడీసీలు చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నాయి. వేలం పాటలో ఎవరు ఎక్కువ మొత్తంలో పాడితే వారికే బెల్టు షాపులను, వైన్సులను అప్పజెపుతున్నారు. వీడీసీలకు డబ్బులు ఇచ్చుకునే వ్యక్తి పర్మిట్ రూంలను ఉదయం నుండి అర్థరాత్రి వరకు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి పర్మిట్ రూము బెల్టు షాపులకు లక్షలాది రూపాయల్లో నగదును వీడీసీలకు సమర్పించుకుంటున్నాయి. వీటి నిర్వహణకు వీడీసీలు లైసెన్సు తరహా అనుమతులను జారీ చేస్తున్నాయి. వీడీసీల అనుమతితో పల్లెల్లో వెలసిన బెల్టుషాపుల్లో దర్జాగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. అధికారులు చూసీ చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటితోపాటు వాగులు, చెరువులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇసుక క్వారీలపై, మొరం క్వారీలపై కూడా వీడీసీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇసుక క్వారీలకు, మొరం క్వారీలకు వేలం పాటలు నిర్వహిస్తూ, ట్రిప్పుల వారీగా నగదు వసూలు చేస్తూ లక్షలాది రూపాయలను దండు కుంటున్నాయి. కొన్ని గ్రామాల్లో కూల్ డ్రింక్ షాప్ లకు, చికెన్ సెంటర్లకు, మటన్ సెంటర్లకు వేలం పాటలు నిర్వహించి నిధుల సేకరణ కోసం వీడీసీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నాయి.
ఆర్మూర్ డివిజన్‍లోని వేల్పూర్ మండలం పచ్చల నడకుడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన యాదవ కుల సంఘానికి చెందిన లింగన్న అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన చిన్న కుమారుడు లింగేశ్వర్ తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అయితే యాదవ సంఘం నుండి లింగేశ్వర్ ను కుల బహిష్కరణ వేటు వేసింది.
ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గతేడాది ప్రారంభంలో మత్స్యకార సంఘ సభ్యులు చేపలను కాంట్రాక్టర్ కు అమ్మితే స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కాంట్రాక్టర్ కు విక్రయించొద్దని హుకుం జారీ చేశారు. వీడీసీ హుకుంను వ్యతిరేకించిన పాపానికి మత్స్యకార సంఘ సభ్యులపై బహిష్కరణ వేటు వేశారు. ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో సుర్భిర్యాల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోమన్ పల్లి శివారులోని ఆయన భూమిని రెవిన్యూ అధికారుల చేత సర్వే చేయించుకున్నారు. ఈ సర్వేలో కోమన్ పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సర్వేలో సాక్షి సంతకాలు పెట్టినందుకు కోమన్ పల్లి వాసులకు జరిమానా విధించారు. జరిమానాతో పాటు వారిద్దరికీ కోమన్ పల్లి లో ఎవరు వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ తో భూములు దున్నడం, కూలీ పనులకు వెళ్లడంపై గ్రామకమిటీ ఆంక్షలు విధించింది.
ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మోర్తాడ్, తాళ్లరాంపూర్ గ్రామాల్లో, ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ , ఫతేపూర్ గ్రామాల్లో గీత కార్మిక సంఘాలపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ విధించి వారు గీసిన కల్లు ఎవరూ తాగవద్దని, గౌడ కుల సంఘ సభ్యులను బహిష్కరించారు. కల్లు డిపోల నిర్వహిస్తున్నందుకు గౌడ సంఘాల నుండి వీడీసీ అధికంగా డబ్బులు డిమాండ్ చేయగా, గౌడ సంఘ సభ్యులు నిరాకరించడంతో వారిపై వీడీసీ కన్నెర్ర చేసింది. దీంతో గ్రామంలో ఇది పెద్ద సమస్యగా మారింది.
ఆలూరు మండలంలోని దేగాం గ్రామంలో ఓ ఎస్సీ వర్గానికి చెందిన పెండ్లిలో భోజనాల వద్ద జరిగిన వివాదంలో జరిగిన గొడవలు చివరకు గంగాధర్, ముత్తన్న అనే ఇద్దరిని కుల బహిష్కరణకు దారి తీసింది. ఈ గొడవ పెద్దదై కత్తిపోట్ల వరకు దారితీసింది.
జిల్లాలో వీడీసీలు, కుల సంఘాల నియంతృత్వ పోకడలు పెచ్చుమీరుతున్నాయి. వారి ఆగడాలు శృతిమించుతున్నా నియంత్రించే వ్యవస్థలేం చేస్తున్నట్లు..? ఈ రాజ్యాంగేతర శక్తులను నియంత్రించేదేవరంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం..
గ్రామాభివృద్ధి కమిటీలు గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలే తప్ప చట్టాలను వారి గుప్పిట్లోకి తీసుకోవడం నేరం. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై మాకు ఫిర్యాదు చేస్తే సంబంధిత వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు వచ్చిన వీడీసీ సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.
సత్యనారాయణ గౌడ్, ఎస్ హెచ్ఓ ఆర్మూర్..






