- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడ్వాయిలో వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు
మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వెల్లువ నడుమ జరిగాయి.

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వెల్లువ నడుమ జరిగాయి. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ అపురూప వేడుకను పురస్కరించుకుని మండల కేంద్రమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. శుక్రవారం ఉదయం నుంచే ముదిరాజ్ కులస్థుల ఇళ్లలో సందడి నెలకొంది. ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు తయారు చేసి, బోనాలను అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, డీజే పాటలు, డప్పు చప్పుళ్ల నడుమ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాయంత్రం బోనాల ఊరేగింపు సాగింది. వేపాకులు, పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలతో మహిళలు తరలివస్తుంటే తాడ్వాయి వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఊరేగింపు పొడవునా డప్పుల దరువుకు అనుగుణంగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. చిన్నారుల కేరింతలు, డీజే పాటలకు యువత వేసిన చిందులు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఐదేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన వేడుక కావడంతో ముదిరాజ్ బిడ్డలందరూ ఏకమై అమ్మవారికి ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ....గ్రామం చల్లగా ఉండాలని,అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం బాధ్యులు, పంబల సతీష్ పంబల్ల పాండరి,పవన్,ఆయా గ్రామాలనుంచి వచ్చిన బంధువులు,యువకులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






