నిజామాబాద్ బల్ధియాలో రూ. 272 కోట్ల అంచనా బడ్జెట్ కు ఆమోదం..

by Sumithra |
నిజామాబాద్ బల్ధియాలో రూ. 272 కోట్ల అంచనా బడ్జెట్ కు ఆమోదం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ 2023-24 అర్థిక సంవత్సరానికి గాను రూ. 272.72 కోట్ల తో అంచనా బడ్జెట్ ను ఆమోదించింది. సోమవారం కొత్త అంబేద్కర్ భవన్ లో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతుకిరణ్ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొత్త బడ్జెట్ పై చర్చ జరిగింది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు తొలిసారి బల్ధియా సమావేశానికి హజరు కాగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర పాలక సంస్థ ఇంచార్జీ కమీషనర్ చిత్రా మిశ్రాలు హజరయ్యారు. ఈ సంధర్బంగా 2022-23 బడ్జేట్ రూ. 170 కోట్లతో ప్రవేశ పెట్టగా అందులో మిగులుగా రూ.25 లక్షలను చూపారు. కొత్త అర్థిక సంవత్సరానికి రూ.214 బడ్జెట్ ను ప్రతిపాధించిన, వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని రూ.272.72 కోట్ల అంచనా బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.

పన్నులు, పన్నేతర వనరులు, అద్దెలు, ప్రజారోగ్యం, పారిశుధ్య విభాగం , పట్టణ ప్రణాళిక విభాగం, ఇంజనీరింగ్, డిపాజిట్లు, రుణాలు ప్రణాళికేతర నిధులు, ప్రణాళిక నిధులు, ఇతర గ్రాంట్ ల ద్వార వస్తున్న ఆదాయానికి అవుతున్న వ్యయాలను పరిగణలోకి తీసుకుని అంచనా బడ్జెట్ ను గతేడాది కంటే రూ.100 కోట్ల పెంచారు. దానిని కౌన్సిల్ సమావేశం ఎకగ్రీవంగా బడ్జెట్ ను అమోదించింది. నిజామాబాద్ బల్ధియాలో నెలకొన్న సమస్యలపై చర్చించకుండా కేవలం గత బడ్జెట్ అంచనా వ్యయాలను చదువుకొని, కొత్త బడ్జెట్ ను ఆమోదించుకున్నారు. దాదాపు ఆరునెలల తరువాత జరిగిన సమావేశం కాస్తా కేవలం బడ్జెట్ సమావేశంగా ముగించేశారు. మీడియాకు అనుమతించకుండానే సమావేశం గంట వ్యవధిలో నిర్వహించి మమా అనిపించారు.

ఇందూర్ కళా భారతీ ఆడిటోరియం కాదు... అంబేద్కర్ ఆడిటోరియం అని పేరు పెట్టండి : ఎంఐఏం డిమాండ్

నిజామాబాద్ నగర నడిబొడ్డున రూ.50 కోట్ల వ్యయంతో పాత కలెక్టరేట్ వద్ధ నిర్మించే ఇందూర్ కళాభారతీ ఆడిటోరియంకు రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంగా పెరు పెట్టాలని ఎంఐఏం నాయకులు డిమాండ్ చేశారు. ఖిల్లారోడ్డులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. డివిజన్ ల డెవలప్ మెంట్ కోసం ప్రతిడివిజన్ కు జనరల్ ఫండ్ లనుంచి రూ.10 లక్షల కేటాయించాలని కోరగా పాలకవర్గం ఆమోదించింది.

నగర సమస్యలు చర్చించకుండా మెజార్టీ వుందని బడ్జెట్ ఆమోదించుకున్నారు..న్యాలం రాజు

కొన్ని నెలల తరువాత జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నగర సమస్యలు చర్చించకుండా మెజార్టీ వుందని అధికార పార్టీ బడ్జేట్ ను ఆమోదించుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులు, మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనం , ట్యాంక్ బండ్ నిర్మాణం, జనరల్ స్మశాన వాటిక అభివృధి, నాన్ వెజ్ మార్కెట్, ఎల్లమ్మ గుట్ట బ్రిడ్జి పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి అంటే ఆర్ అండ్ బీ శాఖ చూస్తుందని దాటవేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, పంపిణి ఊసే తియ్యలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు పూర్తిచేసి అందు బాటులోకి తెస్తారు అనే అంశం ఉసేత్తలేదు.

బడ్జెట్ ప్రతులను చింపి నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్..

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సోమవారం ప్రవేశ పెట్టిన అంచనా బడ్జెట్ పై కాంగ్రేస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ నిరసన వ్యక్తం చేశారు. బల్ధియా సమావేశం జరుగుతున్న అంబేద్కర్ భవన్ ఎదుట బడ్జెట్ ప్రతులను చించి నిరసన తెలిపారు. నిజామాబాద్ ప్రజలపై చిత్త శుద్ధి ఉంటే స్లమ్ ఏరియాలలో తాగు నీరు, రోడ్డు వ్యవస్థ అందించి పేద ప్రజలను అదుకోవలన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ మాఫియాను పోత్సహిస్తుందని ఆరోపించారు. నిదులు కేటాయింపు సరిగా లేదని, స్మశాన వాటికలను అంగరంగ వైభవంగా తీర్చి దిద్దటం చూస్తుంటే బాధలో ఉన్న ప్రజలను గార్డెన్ లో సంతోషంగా ఎలా గడపమని చెబుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ అన్నారు. ప్రజలు బాధలో దవాఖానకు వెళ్తే అక్కడ వసతులు సరిగా ఉండడం లేదని, అక్కడ ఎలుకలు, కుక్కలు, పందులు,పంది కొక్కులు, పిల్లులకు స్థావరంగ తయారైనదని, స్మశాన వాటికలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గార్డెన్ లు నిర్మించి లాభం లేదని అన్నారు. ఈ బడ్జెట్ను తిరస్కరిస్తున్నామని అన్నారు.

Next Story

Most Viewed