నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్.. ముగ్గురు అరెస్ట్

by Kodari Anjali |

అక్రమంగా కబ్జా చేసి, తప్పుడు పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, కామారెడ్డి రూరల్: అక్రమంగా కబ్జా చేసి, తప్పుడు పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. కేసును దేవునిపల్లి పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కేసును లోతుగా విచారించారు. దర్యాప్తులో, దేవునిపల్లి వార్డు పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1లో గల ప్లాట్ నెం.71 అసలు యజమాని ముక్తవరం వెంకటయ్య పేరుమీద ఉంది. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి తనపై ఉన్న అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో అక్రమంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని విక్రయించాలని కుట్ర పన్నినట్లు తేలింది. ఈ కుట్రలో భాగంగా తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా చూపించి, తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామానికి చెందిన తన మామ సంగారెడ్డిని అసలు యజమాని ముక్తవరం వెంకటయ్యగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నటింపజేసి, తప్పుడు గుర్తింపు పత్రాలు, నకిలీ ఆధారాలు ఉపయోగించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

భూముల కొనుగోలు సమయంలో..

అనంతరం అదే స్థలాన్ని అసలు విషయాన్ని దాచిపెట్టి ఇతరులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ స్థలం పలువురి పేర్లకు వరుసగా రిజిస్ట్రేషన్ అయినట్లు విచారణలో తేలింది. విచారణలో ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించగా, ఈ కేసులో బండారి శ్రీనివాస్ రెడ్డి, బండారి సునీత, సంగారెడ్డిలను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినారు. కేసును దేవునిపల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భూముల కొనుగోలు సమయంలో యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్ చరిత్ర, రెవెన్యూ రికార్డులు, సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. తప్పుడు పత్రాలు సృష్టించడం, వేరే వ్యక్తిని అసలు యజమానిగా చూపించి రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రజలను మోసం చేయడం వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story