టిక్కెట్ రాకుంటే గ్రూపులు పెట్టుడే..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు తలనొప్పిగా మారుతున్నాయి. పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారు.

టిక్కెట్ రాకుంటే గ్రూపులు పెట్టుడే..!
X

దిశ, కామారెడ్డి : స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు తలనొప్పిగా మారుతున్నాయి. పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారు. దానికోసం గ్రామాల్లో ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీకి టికెట్ లభిస్తుందా లేదా అనే అనుమానాలు ఆశావహులను కలవరానికి గురి చేస్తున్నాయి. దాంతో ప్లాన్ బి అమలు చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. పార్టీ టికెట్ ఇస్తే సరి లేకపోతే అవతలి పార్టీ వ్యక్తికి లోలోపల సపోర్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ మారితే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్లాన్ అమలు చేస్తే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని భావిస్తున్నారు. పార్టీ నేతలు కూడా ఆలోచనలో పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

టిక్కెట్ రాకుంటే ఆ అభ్యర్థిని ఓడించుడే..!

పోటీ చేయడానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చినప్పటికీ పార్టీ తమకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ఆశావాహులు ఇప్పటినుండే ప్రిపేర్ అవుతున్నారు. చాటుగా ఎదుటి పార్టీ వ్యక్తికి సపోర్ట్ చేసి సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. తనకు దక్కనిది తన పార్టీ మరొకరికి టికెట్ ఇస్తే అతనికి కూడా దక్కకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.

అన్ని పార్టీల‌ది అదే ప‌రిస్థితి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్ప‌టి నుంచో పోటీ చేయాలని ఆశపడిన ఆశావహులు టికెట్ దక్కకుంటే ఎలాగైనా తమకు దక్కని స్థానం తమ పార్టీలో మరొకరికి దక్కడంతో ఎలాగైనా సదరు క్యాండిడేట్ ని ఓడించడానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితి దాదాపు అన్ని పార్టీల్లోనూ కనిపిస్తుంది. లోలోపల మైండ్ గేమ్ ఆడెందుకు సిద్ధపడుతున్నారు.

అధిష్టానం వద్దకు ఆశావహుల జాబితా

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆశావాహుల జాబితా ఈపాటికే అన్ని పార్టీల అధిష్టానం వద్దకు చేరుకుంది. వారు పార్టీకి వెన్ను దన్నుగా ఉండడంతోపాటు గెలిచే అవకాశాలున్న వారి పేర్లను వడబోసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా టికెట్ ఆశించి భంగపడితే తాము ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయడానికి ఆశావాహులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

భంగ పడిన వారిని బుజ్జగించే పనిలో నేతలు

టికెట్ ఆశించి భంగ పడిన వారిని సముదాయించే పనిలో అన్ని పార్టీల నేతలు సిద్ధం అయ్యారు. పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపించాలని, పార్టీ అభ్యర్థి గెలిస్తే పార్టీ పదవులతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఆశలు చూపెడుతూ భంగపడిన వారిని సముదాయించే పనిలో ఉన్నారు.

Next Story