సీఎం సభకు జనం తరలింపు ఎలా..? నేతలకు సభ సక్సెస్‌పై టెన్షన్

by Disha Web Desk 6 |
సీఎం సభకు జనం తరలింపు ఎలా..? నేతలకు సభ సక్సెస్‌పై టెన్షన్
X

దిశ, ప్రతినిధి నిర్మల్: ఈనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభపై అధికార పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. లక్ష మంది జనానికి మించకుండా సభ నిర్వహించాలని నిర్ధేశించుకున్న గులాబీ దళానికి తమ ముందున్న సవాళ్లు సీఎం సభ ఏ మేరకు సక్సెస్ అవుతుందోనన్న ఆందోళన కలిగిస్తోంది.

ప్రతికూల పరిస్థితులను అధిగమించడం ఎలా..

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ పర్యటన సందర్భంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ సభ జరిగినా భారీఎత్తున జనం ఉంటేనే ఆసక్తి ప్రదర్శించే ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం జరిగే సభకు జనాన్ని ఎలా తరలించాలో అనే అంశంపై పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి జూన్ 4వ తేదీన సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అన్న విషయంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు రేఖా నాయక్, విఠల్ రెడ్డి యోచిస్తున్నారు. నిర్మల్ జిల్లా నుంచే లక్ష మందిని తరలించాలని ప్రణాళిక వేసుకున్న గులాబీ శ్రేణులు ఆ స్థాయిలో జనం వస్తారా లేదా అన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నారు.

తీవ్రమైన ఎండలు

సీఎం సభకు జనం తరలించే విషయంలో ఎండలు ప్రధాన అద్దంకిగా మారుతున్నాయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా సీఎం సభలో జనం హాజరు కావాల్సి ఉండడంతో అది తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్నాయి. వాహనాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి తరలించి వారికి అన్ని వసతులు కల్పించడంతోపాటు అవసరమైతే రవాణా భత్యం ఇచ్చినా మంచిదే కానీ జనం ఉండాలన్న ఆలోచనతో పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు. రోజు 45 డిగ్రీలను మించి ఎండలు నమోదు అవుతుండడంతో ఆ ఎండల్లో ప్రజలు సభలో కూర్చుంటారా... వెళ్లిపోతారా అన్న ఆందోళన కూడా అధికార పార్టీ నేతల్లో ఉంది.

ధాన్యం కల్లాల వద్ద రైతులు

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే ఏ సభలోనైనా రైతులు భారీగా ఉండేలా అధికార పార్టీ నేతలు ప్లాన్ చేస్తుంటారు. ఇతర జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోలు 70 శాతం పూర్తికాగా నిర్మల్ జిల్లాలో మాత్రం ఇంకా 35% దాటలేదు. దీంతో రైతులు వరి కల్లాల వద్దనే ధాన్యం అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రోజు చెడగొట్టు వానల ప్రభావం ఉండడంతో కల్లాలను వదిలి రైతులు సీఎం సభకు వస్తారా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ధాన్యం తరలింపు విషయంలో అధికార పార్టీ నేతలు పట్టించుకోవడంలేదని రైతుల్లో తీవ్ర ఆగ్రహం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం సభకు రావాలని గ్రామాల్లో అధికార పార్టీ నేతలు రైతులను అడిగే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు.

మహిళ సంఘాలపైనే దృష్టి..

ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనసాగుతున్న మహిళ పొదుపు సంఘాల పైనే అధికార పార్టీ నేతలు దృష్టి పెడుతున్నారు. గ్రామాల్లో ఉండే మహిళా సంఘాలను భారీగా తరలించేందుకు ఆలోచన చేస్తున్నారు. వీరితోపాటు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఇతర ప్రభుత్వ అనుబంధ కార్యక్రమాల్లో పనిచేస్తున్న వారిని కూడా తరలిస్తే సభ విజయవంతం అవుతుందని భావిస్తున్నారు.

మంత్రి ఐకేఆర్ ఆదేశం

నిర్మల్ జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గం నుంచి సీఎం సభకు జనం తరలింపు అంశంపై మండలాల వారీగా కీలక నేతలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. వాహనాలను సమకూర్చడంతో పాటు సీఎం సభకు వచ్చి వెళ్లేంతవరకు జనాన్ని సజావుగా చేర్చే విషయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికే పార్టీ నేతలకు పలు దఫాలుగా దిశా నిర్దేశం చేశారు. తాజాగా బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు శాసన మండలి సభ్యుడు దండే విట్టల్ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి రేఖా నాయక్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రామ్ కిషన్ రెడ్డి తోపాటు ఆయా మార్కెట్ కమిటీలు దేవాలయాల కమిటీలు మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ సభ్యులు తదితరులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ కీలక నేతలతో మాట్లాడి సభను విజయవంతం చేసేందుకు మంత్రి నేతృత్వంలో ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు.

Read more:

హస్తం వైపు చూస్తున్న బీజేపీ , బీఆర్ఎస్ అసంతృప్తులు


Next Story

Most Viewed