ఆసియా అండర్-20 మీట్‌లో భారత అథ్లెట్ల జోరు

by Dishanational3 |
ఆసియా అండర్-20 మీట్‌లో భారత అథ్లెట్ల జోరు
X

దిశ, స్పోర్ట్స్ : దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శనివారం మరో ఆరు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. అందులో మూడు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఈ టోర్నీలో భారత మహిళా అథ్లెట్లు లక్షిత వినోద్, ఏక్తా ప్రదీప్ దే మరోసారి మెరిశారు. 1,500 మీటర్ల రేసులో లక్షిత 4:25.63 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకం సాధించింది. ఆమెకు ఇది రెండో రజతం. 800 మీటర్ల రేసులో ఇప్పటికే సిల్వర్ మెడల్ గెలిచింది.

అలాగే, 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణం సాధించిన ఏక్తా ప్రదీప్ దే 5,000 మీటర్ల ఈవెంట్‌లో రజతం దక్కించుకుంది. 16:49.70 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. అదే ఈవెంట్‌లో సునీత దేవి(16:52.54 సెకన్లు) కాంస్యం నెగ్గింది. పురుషుల 3,000 మీటర్ల పరుగులోనూ భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. గౌరవ్ భాస్కర్(8:31.20 సెకన్లు) రజతం, వికాస్ కుమార్(8:33.00 సెకన్లు) కాంస్యం సాధించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఉన్నతి అయ్యప్ 13.65 సెకన్లతో కాంస్యం కైవసం చేసుకుంది.



Next Story

Most Viewed