రంగంలోకి బీజేపీ అగ్ర ‘త్రయం’.. తెలంగాణలో ప్రచారం హోరెత్తించేలా కమలం పార్టీ భారీ ప్లాన్..!

by Disha Web Desk 19 |
రంగంలోకి బీజేపీ అగ్ర ‘త్రయం’.. తెలంగాణలో ప్రచారం హోరెత్తించేలా కమలం పార్టీ భారీ ప్లాన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ప్రచారానికి బీజేపీ అగ్ర త్రయం రంగంలోకి దిగనుంది. వరుస పర్యటనలతో ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లబోతున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగనుంది. కాగా ఈనెల 29న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెం, మహబూబాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

29న ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనసభ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మహబూబాబాద్ జనసభ బహిరంగ సభ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసంగిస్తారు. కాగా ఈ సభల అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నిజాంపేటలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాత్రి సమయంలో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.

ఇదిలా ఉండగా ప్రధాని మోడీ ఈనెల 30న సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ మండలం సిల్వర్ గ్రామం వద్ద జరగనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతేకాకుండా వచ్చే నెల 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్లగొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ మరో సభలో మోడీ పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట‌లో, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలోని వికారాబాద్‌లో సభలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన మే 1వ తేదీన ఉండనుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో ఈ రోడ్ షో కొనసాగనుంది. హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed