రేపటితో ముగియనున్న ప్రచార పర్వం…మిగిలింది ప్రలోభాల పర్వం

by Disha Web Desk 11 |
రేపటితో ముగియనున్న ప్రచార పర్వం…మిగిలింది ప్రలోభాల పర్వం
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల పర్వంలో కీలకమైన ప్రచారం పర్వానికి తెరపడే సమయం ఆసన్నమైంది. శనివారంతో ఎన్నికల ప్రచార గడువు పూర్తి కానుంది. గత 20 రోజులుగా హోరెత్తించిన మైక్ లు సాయంత్రం 6 గంటలకు బంద్ కానున్నాయి. గత నెల వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలో ప్రచారం జోరుగా సాగింది. కేంద్ర హోంమంత్రి మొదలుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వరకు నిజామాబాద్ జిల్లాలో ప్రచారాన్ని హోరెత్తించారు. పబ్లిక్ మీటింగ్ లు, కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు జోరుగా జరిగాయి. రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మినహా మిగిలిన అగ్రనేతలు జాతీయ పార్టీల పక్షాన ప్రచారం చేశారు. లిక్కర్ కేసు కారణంగా స్టార్ క్యాంపెయినర్ కవిత ప్రచారానికి దూరమయ్యారు. కేటీఆర్ జిల్లాలో పర్యటించనే లేదు. కేసీఆర్, హరీష్ రావులు మినహా బీఆర్ఎస్ అగ్రనేతలెవ్వరు ప్రచారం చేయలేదు.

ప్రచార విషయంలో మీటింగ్ లలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కుల సంఘాలు, యువజన సంఘాల మద్దతు అన్ని పార్టీలు తెగ కసరత్తు చేశాయి. ఈసారి కూడా ఒక బీఆర్ఎస్ మినహా జాతీయ పార్టీలలో చేరికలు జోరుగా జరిగాయి. రెండు పార్టీలు చేరికలను బలమని ప్రచారం చేస్తున్నాయి. అయితే రాష్ట్ర పార్టీ అయిన బీఆర్ఎస్ లు మాత్రం లీడర్లు పోయిన క్యాడర్ మాత్రం తమతో ఉండి బలంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రచార పర్వంలో గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ప్రధానమైతే ఈసారి చక్కెర పరిశ్రమలను తెరిపించడం, గల్ప్ బోర్డు అంశం, ఉపాధి అంశాలు ప్రభావం చూపుతాయని దానిపైనే ప్రచారం జరిగింది.

జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా అందులో తమ హామీలలో ప్రధానంగా వాటికే ప్రాధాన్యత ఇచ్చాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా నుంచి జీవన్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉండగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండవ సారి బీజేపీ తరపున, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగింది. ఈసారి మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినా ఇప్పటి వరకు ప్రచారంలో ఆ అంశమేది ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రచార పర్వంలో ఎలాంటి వివాదాలు లేకపోవడంతో కేసులు, గొడవలు లాంటివి జరుగలేదు. అయితే జాతీయ అంశాలపై వివిధ వివాదాలపై మాత్రం పోలీసులకు ఫిర్యాదులు జరిగాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలను మరిపిస్తున్నాయని చెప్పాలి.

రెండు జాతీయ పార్టీలతో పాటు లోకల్ పార్టీ బీఆర్ఎస్ కూడా ప్రచారంలో దూసుకపోయాయి. అదే సమయంలో ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తొలిసారి ఎన్నికల్లో ప్రచారం కోసం తెగ ఖర్చు చేసిన లీడర్లు ఎన్నికల్లో గంప గుత్త ఓట్ల కోసం వెనుకాడడం లేదు. కుల సంఘాలకు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రతినిధులతో పాటు తమ పార్టీలలో ఉన్నా ఆయా శాఖల ఆధ్వర్యంలో కులాల వారీగా, మతాల వారీగా ఓటర్లకు తాయిలాల పంపిణీ సిద్దమైంది. స్టార్ హోటల్ మొదలుకుని ఏ అవకాశం ఇచ్చినా వదలకుండా ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కుల సంఘాలతోనే నేరుగా ప్రచారం చేయించుకుని ఆయా సామాజిక వర్గాల ఓట్లను దండుకునే పనిలో పడ్డారు.

శనివారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేతకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో ముందస్తుగా మద్యం డంప్ లను చేసిన లీడర్లు వాటిని రాత్రికి రాత్రే లీడర్లకు వీలైతే ఓటర్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన కోటి రూపాయల ఎన్నికల ఖర్చు పరిమితి ఏ మూలకు సరిపోయేలా లేదని కొందరు అభ్యర్థులే వాపోతున్నారు. మిగిలిన అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమకు రావాల్సిన వాటి కోసం లీడర్ల ఇళ్ళ వద్ద ఆయా సంఘాల ప్రతినిధులు, చోటామోటా లీడర్లు, క్యాండెట్ల ఇంటి వద్ద రాత్రనక పగలనక తిష్ట వేసి తమకు రావాల్సిన సొత్తును, మద్యాన్ని తరలించుకపోతున్నారు.

ఎన్నికల కమిషన్ ఎక్కడ నిఘా పెడుతుందోనని రహాస్య ప్రాంతాల నుంచే ఈ తతంగం జరుగుతుంది. ప్రత్యేకంగా లీడర్లు వాటి కోసం కొందరినీ ఎంపిక చేసుకుని ఈ తతంగాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ నెల 12 రాత్రి వరకు ప్రలోభాల పర్వం జోరుగా సాగే అవకాశం ఉంది. కొందరైతే ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేస్తామని ఓటర్లు చెబుతున్నారు. ఓటర్లు కూడా సాధారణ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ లీడర్లు ఇచ్చే వాటిని పుచ్చుకుని తమకు నచ్చే వారికే ఓట్లు వేసేలా ఉన్నారని మరో టాక్ నడుస్తుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed