- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీపురు అమ్మే చేతుల్లో.. బంగారు లాంటి నిజాయితీ
టి సమాజంలో స్వార్థం,అవినీతి రాజ్యమేలుతున్న తరుణంలో.. రెక్కాడితే గానీ డొక్కాడని ఒక సామాన్య మహిళ అసాధారణమైన ఆత్మాభిమానాన్ని చాటుకుంది.

దిశ, తాడ్వాయి : నేటి సమాజంలో స్వార్థం,అవినీతి రాజ్యమేలుతున్న తరుణంలో.. రెక్కాడితే గానీ డొక్కాడని ఒక సామాన్య మహిళ అసాధారణమైన ఆత్మాభిమానాన్ని చాటుకుంది. కోట్లు ఉన్నా దక్కని గొప్ప సంస్కారాన్ని ప్రదర్శించి ఎందరికో విరాళాలు అందించే ఓ బీజేపీ నాయకుడితో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే.. రోడ్డు పక్కన చీపురు పుల్లలు ఏరి వాటిని అమ్మి జీవనం సాగించే ఒక వృద్ధురాలి కి కామారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి రోడ్డు మార్గం గుండా వెళ్తున్న సందర్భంగా ఆశ్చర్యమైన ఘటన ఎదురైంది. ఓ వృద్ధురాలు ఆమె పడుతున్న కష్టాన్ని చూసి చలించిన ఆయన, సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక చీపురు కట్ట ధర అడిగారు. ఆమె రూ.50 అని చెప్పగా, వెంటనే ఆయన నోటును ఆమెకు అందించి, చీపురు తీసుకోకుండానే వెనుతిరగబోయారు.
వెంటనే ఆ వృద్ధురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. తన కష్టార్జితం కానీ డబ్బును తీసుకోవడానికి ఆమె మనసు అంగీకరించలేదు. అయ్యా.. మీరు పెద్దోళ్ళు. కానీ వస్తువు తీసుకోకుండా డబ్బులు ఇస్తే నా నియత్తు (నిజాయితీ) ఉండదు. నా వస్తువు తీసుకోలేదు కాబట్టి ఈ డబ్బు నాకెందుకు? అంటూ సున్నితంగా ఆ నోటును తిరిగి ఇచ్చేసింది. ఎందరికో విరాళాలు ఇచ్చే అలవాటున్న నాయకుడికి, ఒక పేదరాలు చూపిన ఈ నిజాయితీ కళ్లు తెరిపించేలా చేసింది. దీంతో ఆమెలోని నిజాయితీకి, ముగ్ధుడైన ఆ బీజేపీ నాయకుడు ఈ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాయకష్టాన్ని నమ్ముకున్న ఈ పేద తల్లే నిజమైన ధనవంతురాలు అంటూ వేల సంఖ్యలో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆత్మాభిమానం ముందు అపారమైన సంపద కూడా చిన్నబోతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.






