- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైసా కొట్టు.. టికెట్ పట్టు
నామినేషన్ల ఘట్టం ముగిసింది. బి ఫారాలతో సంబంధం లేకుండా అనేక మంది నామినేషన్లు దాఖలు చేశారు.

దిశ, కామారెడ్డి : నామినేషన్ల ఘట్టం ముగిసింది. బి ఫారాలతో సంబంధం లేకుండా అనేక మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పుడు బి ఫార్మ్ కావాలంటే మాత్రం కాసులు ఇచ్చుకోవాల్సిందే. ఇదెక్కడో మారుమూల మున్సిపాలిటీలో అనుకుంటే పొరపాటే. జిల్లా కేంద్రమైన కామారెడ్డి మున్సిపాలిటీలో ఈ తరహా కొత్త దందాకు తెరలేపారు. బి ఫార్మ్ కావాలంటే 5 నుంచి 10 లక్షల వరకు ముట్టజెప్పాల్సిందే. ఈ తరహా దందా ఓ ప్రధాన పార్టీ ముఖ్య అనుచరుడికి కాసులు కురిపిస్తోందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో విస్మయానికి గురిచేస్తోంది. దీంతో అభ్యర్థులు అటు ప్రచారానికి ఏమి ఖర్చు చేయాలి, ఇటు పార్టీ టికెట్ కు ఎలా డబ్బులు కట్టాలంటూ బోరుమంటున్నారు. అయినా తప్పదు కదా అనుకుంటూ నాయకులు అడిగిన ముడుపులు చెల్లించి టికెట్ పట్టుకెళ్తున్నారు. సదరు నాయకుడిని వారించే వాళ్ళు లేకపోవడంతో టికెట్ కోసం డబ్బులు ఇచుకోవాల్సిన పరిస్థితిని కల్పించడం హాట్ టాపిక్ గా మారింది.
డబ్బులు ఇస్తేనే పార్టీ టికెట్
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రచారానికి ఖర్చు చేయడమే కాదు ముందుగా పార్టీ టికెట్ తెచ్చుకోవాలంటే సదరు పార్టీ నాయకుల కు డబ్బులు చెల్లించుకోవాల్సిందే. పార్టీ టికెట్ కోసం డబ్బులు ఇస్తేనే టికెట్ ఇస్తున్నారని లేదంటే మరో వ్యక్తికి టికెట్ ఇస్తామంటూ చెబుతున్నారని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు.
కామారెడ్డి లోని ఓ ప్రధాన పార్టీలో వింత ఆచారం..
పార్టీ టికెట్ కావాలంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన పార్టీ లో వింత ఆచారం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నప్పటికీ వారితో పాటే అంటిపెట్టుకొని ఉన్న కార్యకర్తల వద్ద కూడా ఆ పార్టీ నాయకుడు ఎన్నికలప్పుడు టికెట్ కోసం డబ్బులు వసూలు చేయడం ఆనవాయితీ. ఈ విషయం ఆ పార్టీలో పనిచేసే వారందరికీ తెలుసు కాబట్టి ఎన్నికలప్పుడు పార్టీ టికెట్ కోసం వెళ్లే ముందు లక్షల రూపాయలు వెంటబెట్టుకొని వెళ్లాల్సిందే.
ఐదు లక్షలు పెట్టు.. టికెట్ పట్టు
పార్టీ టికెట్ కావాలంటే రూ.5 లక్షల నుంచి 10 లక్షలు పెట్టు టికెట్ పట్టు.. అనే ఆనవాయితీ కొనసాగుతోంది ఓ ప్రధాన పార్టీలో. గతంలో ఈ విధానం ఉండేది కాదని పలువురు అభ్యర్థులు చెప్తున్నారు. అయితే అభ్యర్థి గెలిచిన తర్వాత డబ్బులు వసూలు చేసే వారన్న టాక్ మాత్రం ఉంది. ప్రస్తుతం గెలవకముందే డబ్బులిచ్చే సంస్కృతి కొత్తగా అలవాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కట్టడి చేస్తారా.. కంటిన్యూ చేస్తారా..?
కొత్త తరహా వసూళ్లకు పాల్పడుతున్న సదరు పార్టీ నేతపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్య నాయకులకు చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో సదరు నేత ఎంత చెప్తే అంతే అన్నట్టుగా సాగుతోంది. ఈ విషయమై అధిష్టానం వసూళ్ల దందాను కట్టడి చేస్తుందా.. లేక ఇదేదో బాగుంది అంటూ కంటిన్యూ చేయాలని సూచిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.






