- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా యూరియా విక్రయాలు
పారదర్శకంగా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జూన్ 17: పారదర్శకంగా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో పూర్తిగా ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ఫలితంగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రణాళికాబద్దంగా యూరియా పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో పంటల సాగు కోసం 80,857 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని అంచనా వేయగా, జిల్లాకు 38,766 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు వచ్చాయని వివరించారు. ఇందులో ఇప్పటివరకు రాష్ట్రంలోనే అత్యధిక పరిమాణంలో 21,071 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారని అన్నారు. ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా 1,46,393 మంది రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. గత సంవత్సరం ఇదే సమయానికి 13,995 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అమ్మకం జరిగిందని, ప్రస్తుతం 21,071 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించామని అన్నారు. జిల్లాలో ఇంకనూ 17,695 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా కోరిన మేరకు యూరియా నిల్వలను ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తున్నందున రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు.
సొసైటీలు, వివిధ సంస్థలు, ప్రైవేట్ డీలర్లతో పాటు జిల్లాలోని 106 రైతు వేదికల ద్వారా కూడా ఎరువుల విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలోని ఏ డీలర్ వద్ద, ఏ సొసైటీలో ఎంత పరిమాణంలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయనే సమాచారం తెలుసుకోగలుతున్నారని అన్నారు. రైతులు సమీప డీలర్ల వద్ద, సొసైటీల సేల్ పాయింట్ల నుండి సాగు చేస్తున్న పంట విస్తీర్ణానికి అవసరమైన యూరియా ను ముందుగా బుక్ చేసుకుని, 24 గంటల లోపు బుకింగ్ ఐడి ఆధారంగా యూరియాను కొనుగోలు చేసుకుంటున్నారని కలెక్టర్ వివరించారు. ఆధార్ ధ్రువీకరణ తో పాటు భూమి యజమాని వివరాలు నమోదు చేసి కౌలు రైతులు కూడా యూరియా బుక్ చేసుకోవచ్చని సూచించారు. పట్టా పాస్ బుక్ లేని రైతులు తమ ఆధీనంలో ఉన్న సాగు భూమి వివరాలను మండల వ్యవసాయ అధికారికి సమర్పించి యూరియా బుక్ చేసుకోవచ్చని అన్నారు. తొలి విడతగా యూరియా కొనుగోలు చేసిన రైతులు తిరిగి పక్షం రోజుల తరువాత మళ్లీ బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని సూచించారు. జిల్లాలో ఈ యాప్ ద్వారా పక్కాగా, పూర్తి పారదర్శకముగ యూరియా పంపిణీ జరుగుతోందని తెలిపారు.






