66 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకోని పంచాయ‌తీ..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : ఆ గ్రామం పంచాయతీగా ఏర్పడి 66 ఏళ్ళు అయింది. పంచాయతీగా ఏర్పడి 66 సంవ‌త్స‌రాలు అయినా ఆ గ్రామంలో ఎస్సీలకు

66 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకోని పంచాయ‌తీ..!
X

దిశ, కామారెడ్డి : ఆ గ్రామం పంచాయతీగా ఏర్పడి 66 ఏళ్ళు అయింది. పంచాయతీగా ఏర్పడి 66 సంవ‌త్స‌రాలు అయినా ఆ గ్రామంలో ఎస్సీలకు ఇప్ప‌టివ‌ర‌కు సర్పంచ్ గా అవకాశం రాలేదు. జనాభా లేదా అంటే రిజర్వేషన్ కు సరిపడా జనాభా ఉంది. అయినా దళిత వర్గానికి సర్పంచ్ అవకాశం రావడం లేదు. ఆ గ్రామం ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదండోయ్.. జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రామం. ఇంతకీ ఆ గ్రామం ఏదో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

జ‌నాభాను ఏవిధంగా ప‌రిగ‌ణ‌లోకి..?

కామారెడ్డి జిల్లా కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరం లోపు ఉన్న గ్రామ‌మే నరసన్నపల్లి. 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఆ గ్రామం లో నేటికీ 2025 వరకు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఎస్సీ రిజర్వేషన్ రాలేదంటే ఆశ్చర్య పోవాల్సిందే. సుమారు 66 సంవత్సరాల కాలంగా ఈ గ్రామంలో దళిత సామాజిక వర్గం ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ ప్రభుత్వాలు ఇప్పటివరకు పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేయలేదు. దీంతో ఆ గ్రామంలో సర్పంచిగా దళిత సామాజిక వర్గానికి చెందినవారు పనిచేయలేకపోయారు. 2011 జనాభా ప్రాతిపదికన ప్రస్తుత రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ వారి మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ.. 2019లో ప్రత్యేక గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. అంతకు ముందు కలిసి ఉన్న తండాలను, అనుబంధ గ్రామాల్లో ఉన్న జనాభాను ఏ విధంగా పరిగణలోకి తీసుకొని సామాజిక న్యాయం చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయం

66 ఏళ్ల ప్రభుత్వాల పాలనలో కామారెడ్డి మండలం నర్సన్న పల్లి గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయమే జరిగింది. అన్ని గ్రామాల్లో రొటేషన్ పద్ధతిలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ ఈ గ్రామంలో మాత్రం ఇప్పటివరకు ఎస్సీలకు సర్పంచ్ పదవికి ఎలాంటి అవకాశం కల్పించలేకపోయారు. చాలా గ్రామాల్లో దళిత సామాజిక వర్గం తక్కువగా ఉన్న గ్రామాల్లో రెండు నుంచి మూడుసార్లు రిజర్వేషన్లు అమలు చేశారు. కానీ ఈ గ్రామం మాత్రం ఇప్పటివరకు రిజర్వేషన్ పొందకపోవడంతో వారు పాలనాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా అన్ని రకాలుగా అన్యాయానికి గురయ్యారు.

వినతి పత్రాలు అందజేసినా దక్కని రిజర్వేషన్

గ్రామపంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నరసన్నపల్లి గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వేషన్ చేయలేదని ఈ దఫా నైనా రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీవో తదితర జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేశారు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా ఆ గ్రామానికి ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించలేకపోయారు. ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వేషన్ కల్పించారు.

రాజకీయ నాయకుల దిక్కారమా.. ప్రభుత్వ నిర్లక్ష్యమా..?

నర్సన్న పల్లె గ్రామ పంచాయతీ కి ఇప్పటివరకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించకపోవడం వెనుక రాజకీయ నాయకుల దిక్కారమా.. లేక ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమే కారణమా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఎస్సీల జనాభా 220, ముదిరాజ్ లు 400, మున్నూరు కాపులు 350, వడ్డెర 150, రెడ్డిలు 150, రజకులు 20, ఎరుకల ఎస్టీలు 8, దర్జీలు 9, గోల్డ్ స్మిత్ పదిమంది, ఇతరులు మరో 50 మందితో సుమారు 1400 జనాభా ఉన్నారు.

Next Story