ధాన్యం కొనుగోళ్లు షురూ.. జిల్లాలో 645కొనుగోలు కేంద్రాలు

by Ajay Maddhiboyina |

ఆరుగాలం కష్టపడి వరి ధాన్యం పండించిన రైతన్నలు ఈ సీజన్ లో ప్రకృతి కంట తడిపెట్టించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో అనేక మండలాల్లో వరి పంటలు నీట మునిగి వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి.

ధాన్యం కొనుగోళ్లు షురూ.. జిల్లాలో 645కొనుగోలు కేంద్రాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆరుగాలం కష్టపడి వరి ధాన్యం పండించిన రైతన్నలను ఈ సీజన్‌లో ప్రకృతి కంట తడిపెట్టించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో అనేక మండలాల్లో వరి పంటలు నీట మునిగి వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. ఈ నష్టం తాలూకు భాదను దిగమింగి రైతన్నలు ఉన్న పంటను కాపాడుకుని పండించుకున్నారు. ఇప్పుడు కోతలు పూర్తి చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వకొనుగోలు కేంద్రాలు కూడా జిల్లాలో తెరుచుకోవడంతో ఈ సారి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోవడంతో రైతులు దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా పోతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనేది లక్ష్యం కాగా, అంతకు మించి ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశాలున్నాయి. ధాన్యంసేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా 645 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల మొదటివారంలోనే పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. పీఏసీఎస్, ఐకేపీ, మెప్మా ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 415 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 220 కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించే ధాన్యానికి 17 శాతానికి తక్కువగా మాయిశ్చర్ ఉన్న గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ. 2,389 లు మద్ధతు ధర కాగా, కామన్ రకానికి రూ. 2369 లు ప్రభుత్వం రైతులకు చెల్లించనుంది.

లారీల కొరత లేకుండాఉంటే ఇబ్బందులు దూరం..

గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో అటు రైతులకు, ఇటు అధికారులకు ఎదురైన అనుభవాల దృష్టిలో ఉంచుకుని ఈ సారి రైతులకు ఇబ్బందుకు కలుగకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. సాధారణంగా ప్రతిసారి కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత, కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. గన్నీ సంచుల కొరతను లేకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో గత సీజన్ లో యంత్రాంగం సఫలీకృతమైంది. కానీ, కొనుగోలు కేంద్రాల నుండి తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు పంపితే వాటిని దింపుకోవడంలో ఇబ్బందులు, ధాన్యం బస్తాలను డంప్ చేసేందుకు జాగా లేకపోవడంతో కూడా ధాన్యం బస్తాలు తీసుకెళ్లిన లారీలు లోడ్ ను దింపకపోవడంతో రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో, కల్లాలపై ఉన్న ధాన్యం అలాగే రోజుల తరబడి ఉండాల్సి వచ్చింది. ఈ లోపు పిలవని పేరంటంగా అకాల వర్షాలు కురిసి రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యం అంతా వర్షార్పణం కావడం కూడా జరిగింది. దీంతో నోటి కాడి ముద్దు వర్షాలకు తడిసిపోయి ధాన్యం నాణ్యత కోల్పోవడంతో రావాల్సినంత ధర రాక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. నష్టాల పాలయ్యారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సాఫీగా ధాన్యం సేకరించే అవకాశాలున్నాయి.

తరుగు పేరుతో జరిగే మోసంపై దృష్టి పెట్టాలి..

ప్రభుత్వం ద్వారా ధాన్యం సేకరించేందకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రధానంగా తరుగు పేరుతో మోసం జరగడం పరిపాటిగా మారింది. ఏ సీజన్ లోనైనా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పీఏసీఎస్, ఐకేపీ,మెప్మా ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ కొనుగోలు కేంద్రంలోనైనా నిర్వాహకులు రైతులను తరుగు పేరుతో నష్టం కలిగించేందుకు కాచుకుని కూర్చుంటారు.ఈ విషయం జిల్లా అధికారులతో పాటు స్థానిక అధికారులకు కూడా స్పష్టంగా తెలుసు. రైతులకు మరీ బాగా తెలుసు. కానీ, కొనుగోలు కేంద్రాల్లో ఈ తరుగు అనేది సర్వసాధరణం అని రైతులే సర్దుకునేలా తమను తాము మైండ్ సెట్ ను మార్చుకున్నారు. తరుగు విషయంలో ఎంత మొత్తుకున్నా, కలెక్టర్ స్థాయి అధికారికి ఫిర్యాదు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో మోసం జరుగకుండా ధాన్యం సేకరణ జరగదనేది జగమెరిగిన సత్యమని కొనుగోలు కేంద్రాల్లో పని చేసే వారే చెప్పుకోవడం వారి నిర్భీతిగా నిదర్శనంగా మారింది. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం, రైతులను విచారించడం అంతా బాగనే ఉందని చెప్పడం షరామామూలుగా జరుగుతున్న తంతు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతుల కష్టాన్ని తరుగు పేరుతో దోచుకునే వారు మాత్రం ప్రతి సీజన్ లో రూ. లక్షలు సంపాదించుకుంటున్నారనే అభిప్రాయాలున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే తప్ప తరుగు పేరుతో రైతులు నష్ట పోయే ప్రమాదం నుండి బయట పడే అవకాశాల్లేవు. కలెక్టర్ సహా జిల్లా అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించాల్సి ఉంది.

Next Story