ప్ర‌భుత్వ బ‌స్సే మాకు ఆధారం.. 10 కొత్త బ‌స్సులు ఇవ్వండి : ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్

by Ratna Kumari |

వంద‌సంవత్సరాలలో పడని అకాల వర్షం కారణంగా వరదలతో అతలాకుతలమైన ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ప్ర‌భుత్వ బ‌స్సే మాకు ఆధారం.. 10 కొత్త బ‌స్సులు ఇవ్వండి : ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్
X

దిశ, తాడ్వాయి : వంద‌సంవత్సరాలలో పడని అకాల వర్షం కారణంగా వరదలతో అతలాకుతలమైన ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల వల్ల నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాలను కలిపే ప్రధాన రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయని ఆయన సభ దృష్టికి తెచ్చారు. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆయా శాఖల నుంచి తక్షణమే నిధులు విడుదల చేసి, కొత్త రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని మంత్రులు సీతక్క,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను కోరారు. మా నియోజకవర్గంలో పేదలే ఎక్కువ.. ప్రభుత్వ బస్సే వారికి ఏకైక ఆధారం అని పేర్కొంటూ, రవాణా ఇబ్బందులను తొలగించేందుకు నూతనంగా 10 టీజీఆర్టీసీ బస్సులను మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు వినతిప త్రం అందజేశామని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

Next Story