నిజామాబాద్ జైలులో గంజాయి కలకలం

by Ratna Kumari |

పకడ్బందీ వ్యవస్థ ఉన్న నిజామాబాద్ జైలు గోడలు దాటి నిషేధిత వస్తువులు, పదార్థాలు బయటి నుండి జైల్లోకి వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నిజామాబాద్ జైలులో గంజాయి కలకలం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జైలు అంటే గట్టి బందోబస్తు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండే రక్షణ వ్యవస్థ.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా డేగ కళ్లులాంటి నిరంతర పహారా.. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్న నిజామాబాద్ జైలు గోడలు దాటి నిషేధిత వస్తువులు, పదార్థాలు బయటి నుండి జైల్లోకి వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నేరస్థుల్లో మార్పును తీసుకొచ్చి వారిలోని నేర ప్రవృత్తిని తొలగించే రకంగా ఉండాల్సిన నిజామాబాద్ కేంద్ర కారాగారం ఎందుకనో ఇప్పుడు నేరస్థులకు సొంతిల్లులాగా మారింది. నిషేధిత వస్తువులు ఏం కావాలన్నా వారికి క్షణాల్లో సమకూర్చే అవాసంగా అది మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిగరెట్లు, గుట్కాలు, పాన్ పరాగ్ లతో పాటు ఏకంగా గంజాయి కూడా జైల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైధీలకు సప్లయ్ అవుతున్నాయంటే జైళ్లో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరు ఖైదీల మధ్య బాహాబాహీతో విషయం వెలుగులోకి..

ఇందూరు జైల్లో ఇటీవల ఇద్దరు ఖైదీలు గంజాయిని సేవించడంతో వారిని జైలు అధికారులు దండించారు. గంజాయి సేవించిన ఖైదీలను విచారించి జైల్లోకి గంజాయి ఎలా వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో విచారించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచి పోయారో, లేదంటే ఆ విషయాన్ని తెలుసుకునే చర్య ల్లో భాగంగానో తెలియదు కాని, ఆ ఇద్దరు ఖైదీలను జైలు సిబ్బంది విచక్షణ రహితంగా చితకబాదిననట్లు తెలిసింది. జైలు అధికారులు, సిబ్బంది కొట్టిన దెబ్బలకు ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయ పడ్డారని, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఖైదీల్లో ఒకరికి పక్కటెముకలు, మరొకరికి కాళ్‌లు విరిగాయన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జైలులో జరుగుతున్న తతంగం మొత్తం బాహ్య ప్రపంచానికి తెలిసింది.

గంజాయి సప్లయ్..

కట్టుదిట్టమైన బందోబస్తు, నిరంతర నిఘా ఉండే నిజామాబాద్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న పలువురు ఖైదీలకు జోరుగా గంజాయి సప్లయ్ అవుతోందని సమాచారం. ఇంతవరకు గుట్టుగా సాగుతున్న ఈ గంజాయి వ్యవహారం ఇద్దరు ఖైదీలు కొట్టుకుని గాయాల పాలవ్వడంతో గంజాయి గుట్టు అందరికీ తెలిసింది. ఆ రోజు జైల్లో ఇద్దరు ఖైదీలు గంజాయి తీసుకున్నారని, గంజాయి మత్తులోనే ఉన్నారని తెలిసింది. గంజాయి విషయం విచారిస్తుండగా జైలు అధికారులతో ఖైదీలు రఫ్ గా మాట్లాడటంతో సహసం కోల్పోయిన పోలీసులు ఖైదీలను తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. విషయం బయటకు పొక్కకుండానే జైలులు అధికారులు లోలోపలే సద్దు మణిగేలా చేద్దామని చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.

జైల్లోకి గంజాయి ఎలా వెళ్లింది?

శత్రు దుర్భేధ్యంగా ఉన్న జైలు గోడలు దాటి గంజాయి లోపలికి ఎలా వెళ్లిందనేది మిలియన్ డాలర్ల అనుమానాస్పద ప్రశ్నగా మారింది. జైలు అంటే అడుగడుగా తనిఖీలు, స్కానర్లతో చెకింగులు, జైల్లో పని చేసే సిబ్బందికైనా లోనికెళ్లాలంటే ఎన్నో ఆంక్షలు, అడ్డంకులు దాటి వెళ్‌లాల్సి ఉంటుంది. మరి ఇంత కఠినతరమైన ఆంక్షలున్న జైలు గోడలు దాటి గంజాయి, సిగరెట్లు, ఇతర నిషేధిత పదా ర్ధాలు లోపల ఉన్న ఖైదీల చేతికి ఎలా అందాయి? నిషేధిత పదార్థాలు జైల్లోకి ఎలా వెళ్లాయో జైలు అధికారులే చెప్పాలి. జైలు సిబ్బంది ద్వారానే గంజాయి, ఇతర నిషేధిత పదార్థాలు జైలు లోపలకి వెళుతున్నాయనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story