- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కిన దొంగల ముఠా
వరుస ఆస్తి నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ, కామారెడ్డి రూరల్: వరుస ఆస్తి నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్ కాలనీలో డీలక్స్ బేకరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారనే సమాచారం అందడంతో ఎస్సై సాయి కృష్ణ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించింది. విచారణలో నిందితులు కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన తిలిపితియా రూబిన్ సింగ్ అలియాస్ రూబీన్ సింగ్, మంగళ్ సింగ్‌గా గుర్తించారు. వీరిద్దరూ బావ–బామ్మర్దులని పోలీసులు తెలిపారు. గంజాయి, మద్యం వ్యసనాలు మరియు ఇతర అవసరాల కోసం డబ్బులు సమకూర్చుకునేందుకు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోటార్‌సైకిల్ చోరీలు, మొబైల్ ఫోన్ దోపిడీలు, హౌస్ బ్రేకింగ్, షట్టర్ లిఫ్టింగ్ వంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. జగద్గిరిగుట్ట, బాచుపల్లి, భిక్కనూరు, రాజంపేట, మాచారెడ్డి, దేవన్‌పల్లి, కామారెడ్డి, పోచారం ఐటీ కారిడార్, యాదాద్రి భువనగిరి, ఘట్‌కేసర్, జనగామ తదితర ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 6 మోటార్ సైకిళ్లు, 23 మొబైల్ ఫోన్లు, 95 గ్రాముల గంజాయి, రెండు డెస్క్‌టాప్ కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 చోరీ కేసులను ఛేదించి, దొంగిలించబడిన ఆస్తిలో అధిక భాగాన్ని రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అజంపురకు చెందిన షేక్ ముజాహిద్, కల్కినగర్‌కు చెందిన ఆసం రాజేందర్ నిందితులకు సహకరించినట్లు గుర్తించి వారిని కూడా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలని, వీల్ లాక్స్ ఉపయోగించాలని, మొబైల్ ఫోన్లలో స్క్రీన్ లాక్, ట్రాకింగ్ సదుపాయాలు తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల వినియోగం లేదా నేర కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కేసులను విజయవంతంగా ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో జిల్లా పోలీసు శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.






