- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"గ్యాంగ్ ఫైల్స్" నేరాలపై పక్కా సాక్ష్యాధారాలు సేకరించాలి : ఎస్పీ రాజేష్ చంద్ర
జిల్లాలో దొంగతనాలు, దోపిడీలు, రాబరీ నేరాలకు సంబంధించిన 'గ్యాంగ్ ఫైల్స్' సాక్ష్యాధారాలు పక్కాగా సేకరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు.

దిశ, కామారెడ్డి : జిల్లాలో దొంగతనాలు, దోపిడీలు, రాబరీ నేరాలకు సంబంధించిన 'గ్యాంగ్ ఫైల్స్' సాక్ష్యాధారాలు పక్కాగా సేకరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాల నేర ప్రవర్తన, సాక్ష్యాధారాల సేకరణ వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి నేరస్తుడి పూర్తి ప్రొఫైల్‌ను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నేరస్తులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడటమే లక్ష్యంగా, పెండింగ్ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని సూచించారు.
కోర్టులో నిందితుల నేరాన్ని నిరూపించేలా శాస్త్రీయ, సాంకేతిక సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి, త్వరితగతిన అభియోగపత్రాలను దాఖలు చేయాలని ఆదేశించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా ప్రతీ కేసులో అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో నేరాల నియంత్రణకు గాను 'ఆపరేషన్ కవచ్' ను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ మేరకు సబ్ డివిజన్ అధికారులు, సీఐలతో చర్చించి, రాత్రి గస్తీలను ముమ్మరం చేయడం, అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం వంటి కీలక సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, వివిధ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, రైటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.






