న‌కిలీ ఉద్యోగాల పేరుతో థాయ్ లాండ్, మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మోసం

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : న‌కిలీ ఉద్యోగాల పేరుతో థాయ్ లాండ్, మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మోసం చేస్తున్న ఘ‌ట‌నను తాజాగా నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్

న‌కిలీ ఉద్యోగాల పేరుతో థాయ్ లాండ్, మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మోసం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : న‌కిలీ ఉద్యోగాల పేరుతో థాయ్ లాండ్, మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మోసం చేస్తున్న ఘ‌ట‌నను తాజాగా నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించారు. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను విదేశాలకు తరలించి, సైబర్ నేరాలకు పాల్పడే గ్యాంగులకు బందీలుగా మార్చుతున్నార‌ని.. నిబంధన 377 కింద ఈ సమస్యను అత్యవసరంగా లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా యువతను థాయ్ లాండ్ ‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు ఏజెంట్లు వసూలు చేస్తున్నారని అర్వింద్ పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరేందుకు అక్కడికి వెళ్లిన వెంటనే వారి పాస్ ‌పోర్టులను స్వాధీనం చేసుకుని, మయన్మార్ లోని ర మయా వడ్డి వంటి తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సైబర్ నేర శిబిరాలకు ఇక్కడి అమాయక యువతను విక్రయిస్తున్నారని అర్వింద్ పేర్కొన్నారు. బాధితులకు తీవ్రంగా హింసిస్తున్నారని, తినడానికి ఆహారం కూడా ఇవ్వకపోవడం, చీకటి గదుల్లో బంధించి హింసించడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబాలు తమకు సమాచారం అందించాయని ఎంపీ అర్వింద్ తెలిపారు.


ఈ నేరాలకు స్థానిక మిలీషియా, సైన్యంలో కొందరు లంచాలు తీసుకుని సహకరిస్తున్నందున రక్షణ చర్యలు మరింత కష్టతరం అవుతోందని అర్వింద్ ధర్మపురి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముఠాకు బలైన వారిలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు కూడా ఉన్నారని, వారంతా ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయి ఉన్నారని ఆయన హౌజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి, ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయ నిరుద్యోగ యువకులను రక్షించి, వారిని తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని అర్వింద్ కోరారు. ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లాల్లో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నేరాలకు సహకరిస్తున్న భారతీయ ఏజెంట్లు, రిక్రూటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు.

Next Story