ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆలస్యంగానైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు

ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆలస్యంగానైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించగా, ఇప్పటి వరకు 100 టన్నుల వరకు మొక్కజొన్న సేరకించారు. కామారెడ్డి జిల్లాలో 18 కేంద్రాలు బుధవారం ఏర్పాటు కానున్నట్లు మార్క్ ఫెడ్ జిల్లా అధికారి మహేశ్ కుమార్ తెలిపారు. క్వింటా మొక్కజొన్నకు మద్ధతు ధర రూ. 2,400 లు చెల్లించనున్నట్లు తెలిపారు.

కేంద్రాలు లేక దళారుల చేతిలో నష్టపోయిన రైతులు..

మొక్కజొన్న కు మద్ధతు ధరను ప్రకటించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో మాత్రం ఇంతకాలం మీన మేషాలు లెక్కించింది. దీంతో రైతులు తమ పంట దిగుబడిని విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఓ పక్క ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, మరో పక్క వర్షం రైతులను భయపెడుతుండటం వంటి పరిస్థితుల్లో రైతుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి కాచుక్కూర్చున్న వ్యాపారులు అడిగినంత ధరకే మొక్కజొన్న ను అమ్మేయాల్సి వచ్చింది. రైతుల అవసరాన్ని బలహీనతను క్యాష్ చేసుకోవడానికి ఉమ్మడి జిల్లాలోని వ్యాపారులంతా సిండికేట్ గా మారిపోయి రైతుల నుండి క్వింటా మొక్కజొన్న ను రూ. 1800 లకే కొనుగోలు చేసుకున్నారు. అంతకు మించి ఇవ్వాలంటే కుదరదని, ఇష్టముంటే ఇవ్వాలని, లేదంటే వద్దని తెగేసి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరకే అమ్ముకున్నారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయనే నమ్మకంతో ఓపిక పట్టి ఆగిన రైతుల మొక్కజొన్న రోడ్లమీదనే వర్షానికి తడిసిపోయి ధాన్యం రంగుమారింది. కొన్ని చోట్ల ధాన్యంలో మొలకలు కూడా వచ్చాయి. దీంతో వ్యాపారులు మరింత ధర తగ్గించడంతో చాలా మంది రైతులు బాగా నష్టపోవాల్సి వచ్చింది.

ముందుగానే కొనుఘగోలు కేంద్రాలు ప్రారంభమై ఉంటే..

మొక్కజొన్న దిగుబడులు ప్రారంభం కావడానికి ముందే మద్ధతు ధరను ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించి ఉంటే రైతులు నష్‌టపోయే వారు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల ముందు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతులిస్తే మార్క్ ఫెడ్ ద్వారా అన్ని జిల్లాల్లో ఎంతో ముందుగానే మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యేవని రైతులంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 శాతం దిగుబడిని రైతులు ప్రైవేట్ వ్‌యాపారులు, దళారులకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. క్వింటాకు రూ. 500 ల చొప్పున రైతులు నష్‌టపోయినట్లు రైతులంటున్నారు. ఆలస్యంగా కోతలు చేపట్టిన రైతులు, ఇప్పటి వరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోకుండా ధాన్యాన్ని నిలువ ఉంచుకున్న రైతులు ఇప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం లభించినట్లయ్యింది. ఓ పక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరుచుకోగానే ఇప్పటి వరకు క్వింటాకు రూ. 1800 లు మాత్రమే చెల్లించి కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారులు ఇప్పుడు కాస్తంతా ధర ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుండటం గమనార్హం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న ను విక్రయించి పూర్తి మద్ధతు ధరను పొందాలని అధికారులు కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు రైతులను కోరుతున్నారు.

Next Story