- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బదిలీల కోసం పదిహేను సంవత్సరాలుగా ఎదురుచూపు..భర్త ఒక చోట..భార్య మరో చోట
వారంతా ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు.

దిశ,నిజాంసాగర్ : వారంతా ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు. పొట్టకూటి కోసం కుటుంబ పోషణార్థం కాంట్రాక్టు ఉద్యోగాల్లో 15 సంవత్సరాల క్రితం చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 22 వేల మంది పనిచేస్తుండగా కామారెడ్డి జిల్లాలో వివిధ స్థాయిలో 732 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.నెలవారీ వేతనాలు వస్తేగానీ.. బతుకు బండి సాగని పరిస్థితి వారిది. ఇలాంటి వారిపై సమగ్ర శిక్ష లో పని చేస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి అధికారులు కక్ష కట్టినట్లుగా ఏండ్ల తరబడి బదిలీలు చేయకపోవడంతో భార్య ఒక చోట,భర్త ఒక చోట జీవనం సాగిస్తూ కనీసం వృద్ధులైన తల్లిదండ్రులను కూడా చూసుకోలేని పరిస్థితి. ఉద్యోగంలో చేరి నాటికి కొందరు మహిళా ఉద్యోగులు పెండ్లి కాకుండా ఉన్నారు. వారిలో కొందరు జిల్లాలు పునర్విభజన తర్వాత భర్త ఒక జిల్లాలో భార్య మరో జిల్లాలో ఉంటూ నానా అవస్థలు పడుతున్నారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ నట్లుగా.. ప్రభుత్వం నుంచి బదిలీలు చేయాలని మెమో వచ్చినా.. అధికారుల జాప్యం తో కాంట్రాక్టు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు.15 ఏండ్లుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలీ చాలని వేతనాలతో బతుకీడుస్తున్న .. సమగ్ర శిక్ష ఉద్యోగుల తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను కలిసి వారి ద్వారా లేఖలు రాయించినప్పటికీ అధికారుల తప్పుడు నిర్ణయాలు ఉద్యోగులకు శాపంగా మారాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. ఉద్యోగ భద్రత సంగతి దేవుడెరుగు..! కనీసం బదిలీలైన చేయమని ప్రాధేయ పడుతున్నారు.
సమగ్ర శిక్షా లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులలో ఎక్కువ మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నియామకం అయ్యారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత చాల మంది స్థానిక జిల్లాలో కాకుండా పక్క జిల్లాలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రోజు 100 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి విధులు నిర్వర్తిస్తూ వీరు తమ పిల్లలు,తల్లిదండ్రులను సరిగా చూసుకోలేకపోతున్నారు. కుటుంబాన్ని వీడి ఉండలేక.. రోజు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్నట్లు చెబుతున్నారు. దూరప్రయాణాల వల్ల అలసట మానసిక వత్తిళ్లతో నలిగిపోవడం తో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
ఇదిలా ఉంటే 11,మార్చి,2025 లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక మెమో జారీ చేస్తూ పాఠశాల స్థాయిలో పార్ట్ టైమ్ ఇన్స్ ట్రక్టర్ లు,స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు,ఎంఆర్సీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు,ఎంఐఎస్ కో- ఆర్డినేటర్లు,జిల్లా ప్రాజెక్టు ఆఫీసు లో సిస్టమ్ అనలిస్ట్, ఏపీఓలకు బదిలీలకు ప్రత్యేకంగా ఫైల్ పెట్టమని కోరగా,రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయ అధికారులు మాత్రం వచ్చే సంవత్సరం మే నెలలో జిల్లా,అంతర్ జిల్లా బదిలీలు చేస్తామనడం విడ్డూరంగా ఉంది. బదిలీలు చేయడం వల్ల ఈ విద్య సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడదు.వీరందరూ కూడా విద్యేతర పనులు చేసేవారే. ప్రభుత్వం చేయబడుతున్నట్టు వంటి ఉపాధ్యాయ ప్రమోషన్ లలో బోధన అభ్యసన ప్రక్రియకు ఆటంకం కలగనప్పుడు వీరికే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని కొందరు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో వారికి బదిలీలు నిర్వహించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






