- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోరు లేని పొలాల్లో బావి నీటితో బంగారం
దిశ,తాడ్వాయి : ఈ ప్రాంతంలో రబీ సీజన్ అంటేనే రైతులు ఎదుర్కొనే ప్రధాన సవాల్ నీటి కొరత. ఇక్కడ పొలాల్లో బోర్ వేసినా నీరు పడక, బావి నీరే ఏకైక ఆధారం.

దిశ,తాడ్వాయి : ఈ ప్రాంతంలో రబీ సీజన్ అంటేనే రైతులు ఎదుర్కొనే ప్రధాన సవాల్ నీటి కొరత. ఇక్కడ పొలాల్లో బోర్ వేసినా నీరు పడక, బావి నీరే ఏకైక ఆధారం. అయితే తాడ్వాయి గ్రామం, దాని చుట్టుపక్కల మరికొన్ని గ్రామాల రైతులు ఈ సవాల్‌ను ఒక అవకాశంగా మలుచుకున్నారు.సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి,ప్రతి ఏటా డ్రిప్,రెయిన్ డ్రిప్ వంటి ఆధునిక పద్ధతులను వాడుతూ, తక్కువ నీటితో అధిక దిగుబడి సాధిస్తూ మండలంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో,ఈ గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో ఇప్పుడు రెయిన్ డ్రిప్ పైపులతో బీర్నేస్ పంట సాగుకు సిద్ధమవుతున్నాయి.
బావులే ఆధారం.. అప్పుడే ఆలోచన
ఈ ప్రాంతంలో పంట సాగు పూర్తిగా బావుల్లోని పరిమిత నీటిపైనే ఆధారపడి ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటడం వలన, సాధారణంగా బోర్ల ద్వారా నీరు లభ్యం కాదు. దీంతో గతంలో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలు వేయడానికి భయపడేవారు. పరిమిత నీటితో సాగు చేసినా, వృథా ఎక్కువగా ఉండటం వల్ల పంటలు ఎండిపోవడం, పెట్టుబడి కూడా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి.
సరికొత్త డ్రిప్ వరం
ఈ పరిస్థితుల్లో, తాడ్వాయి, మరీకిన్ని గ్రామాల రైతులు ఒకరిని చూసి మరొకరు చైతన్యం చెందారు. సాగులో డ్రిప్, రెయిన్ డ్రిప్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అవలంబించడం ప్రారంభించారు. రెయిన్ డ్రిప్ పద్ధతి ద్వారా నీరు కేవలం మొక్క వేరుకు మాత్రమే అందిస్తారు. దీంతో సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే 50 శాతం కంటే ఎక్కువ నీటిని ఆదా చేయగలుగుతున్నారు. దీనివల్ల బావుల్లోని నీరు ఎక్కువ కాలం పంటకు సరిపోతుంది.
రబీకి రెడీ అయిన పొలాలు
ప్రస్తుతం రబీ సీజన్ మొదలు కావడంతో, ఈ గ్రామాల వ్యవసాయ పొలాలన్నీ రెయిన్ డ్రిప్ పరికరాలతో కొత్త సొగసును సంతరించుకున్నాయి.ముఖ్యంగా కూరగాయల పంటలతో పాటు ప్రధానంగా బీర్నిస్ సాగుకు రైతులు సిద్ధమయ్యారు.రెయిన్ డ్రిప్ వల్ల తెగుళ్లు కూడా తక్కువగా వస్తాయని,మూడు నెలల పంట కాలంతో పాటు ఎరువులను కూడా నేరుగా మొక్కకు అందించవచ్చని రైతులు చెబుతున్నారు.
ఒకప్పుడు ఎకరనికి సరిపడే బావి నీరు...డ్రిప్ ద్వారా అదే బావి నీటితో మూడు ఎకరాల్లో సాగుచేస్తున్నాం : యువ రైతు గొల్ల అనిల్
గతంలో ఒక ఎకరం పండించాలంటే బావి నీరు మూడు నెలలకే సరిపోయేది కాదు. ఇప్పుడు రెయిన్ డ్రిప్ వేసిన తర్వాత, అదే నీటితో సులభంగా మూడు ఎకరాలకు సరిపడా అందిస్తూ పంటను పండిస్తున్నాం.మాకు డ్రిప్ ఒక వరం లాంటిది.తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నాం






