రైతులారా ఏకం కండి.. లేకుంటే మ‌న బ‌తుకులు అంధ‌కార‌మే..!

by Ratna Kumari |

ప్రభుత్వ ఆశయాలకు అధికారుల అలసత్వం తూట్లు పొడుస్తోంది. ప్రతిష్టాత్మక ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ రైతు వేదికలో ప్రహసనంగా మారాయి.

రైతులారా ఏకం కండి.. లేకుంటే మ‌న బ‌తుకులు అంధ‌కార‌మే..!
X

దిశ, తాడ్వాయి: ప్రభుత్వ ఆశయాలకు అధికారుల అలసత్వం తూట్లు పొడుస్తోంది. ప్రతిష్టాత్మక ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ రైతు వేదికలో ప్రహసనంగా మారాయి. గురువారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దంగా నిలిచింది. వందలాది మంది రైతులు హాజరై పథకాలపై అవగాహన పొందాల్సిన చోట, అధికారులు కొద్ది మంది రైతులతోనే కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. పట్టుమని ఇరవై మంది రైతులు కూడా లేని చోట కార్యక్రమం నిర్వహించి, మొక్కుబడిగా చేతులు దులుపుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

​ పథకాలు ఘనం.. ప్రచారం శూన్యం

సౌర విద్యుత్ ద్వారా రైతులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, భారీ సబ్సిడీ వంటి అద్భుతమైన పథకాలు ఉన్నప్పటికీ, వాటిని క్షేత్రస్థాయికి చేరవేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే సందేహం కలుగుతుంది. గ్రిడ్‌కు విద్యుత్ అమ్మి ఆదాయం పొందే అవకాశం ఉన్నా, ఆ సమాచారం రైతులకు తెలియకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనం. ప్రచార ఆర్భాటం తప్ప, రైతులకు మేలు చేయాలనే తపన అధికారుల్లో కరువైందని రైతులు మండిపడుతున్నారు.

​ చెప్రాసీ కంటే అధ్వాన్నంగా మా బతుకులు

అతికొద్ది మంది రైతులు అధికారుల తీరు పై నిప్పులు చెరిగారు. రైతు రాజు అనేది కేవలం కాగితాలకే పరిమితం. క్షేత్రస్థాయిలో మా బతుకులు ఒక చెప్రాసీ కంటే హీనంగా మారాయి. అందరికీ అన్నం పెట్టే మాకు గౌరవం లేదు. గిట్టుబాటు ధర లేదు. మాకంటూ ఒక బలమైన గొంతు లేకపోవడం వల్లే అధికారులు మమ్మల్ని ఇంత చులకనగా చూస్తున్నారు అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మ‌రో రైతు మాట్లాడుతూ రాజ‌కీయ నాయ‌కులు, అధికారులు త‌మ బాధ్య‌త‌ను గుర్తించి స‌రిగ్గా ప‌ని చేస్తే ఎవ్వ‌రికీ ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కానీ ఇక్కడ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి అని వ్యాఖ్యానించారు. పార్టీలకతీతంగా రైతులు ఐక్యం కాకపోతే భవిష్యత్తు అంధకారమేనని ఆయన హెచ్చరించారు.

​ నివేదికల కోసమేనా ఈ ఆరాటం?

కేవలం కాగితాల్లో నివేదికల కోసం, ఉన్నతాధికారులకు లెక్కలు చూపడం కోసం ఇలాంటి ‘తూతూమంత్రం’ కార్యక్రమాలు నిర్వహించి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం నామమాత్రంగానే పాల్గొని మమ అనిపించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు నిజమైన ప్రయోజనం చేకూరేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలొ జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఏడీఏ సుధా మాధురి, విద్యుత్ శాఖ అధికారులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story