- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్లో రోడ్డెక్కిన రైతులు ...తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో బుధవారం అన్నదాతలు రోడ్డెక్కారు. ఏప్రిల్ చివరి వారం నుంచి మే ప్రారంభం వరకు నిరంతరంగా కురిసిన అకాల వర్షాలతో పాటు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో, రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో బుధవారం అన్నదాతలు రోడ్డెక్కారు. ఏప్రిల్ చివరి వారం నుంచి మే ప్రారంభం వరకు నిరంతరంగా కురిసిన అకాల వర్షాలతో పాటు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో, రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్మూర్ ఆలూర్ బైపాస్ రోడ్డులో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ధాన్యం తడిసినందున రైతులు అధికంగా నష్టపోతున్నారని, ప్రభుత్వమే జోక్యం చేసుకొని వెంటనే కొనుగోలు చేయాలని వారు కోరారు.
ఆందోళన వార్త తెలుసుకున్న ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, ఎస్‌హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తదితర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ రాక కోసం డిమాండ్ చేసిన రైతులకు, ఆర్డీవో "ప్రతి చోటా కలెక్టర్ రావడం సాధ్యం కాదు, కానీ అధికారులతో మాట్లాడి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా చూస్తాను" అని హామీ ఇచ్చారు. అయినా రైతులు నిరసన విరమించకపోవడంతో, పోలీస్ సిబ్బంది వారిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆర్మూర్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రవాణా నిర్వహణను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో వరి ధాన్యాన్ని తక్షణమే, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






