అన్నదాతకు అగ్నిపరీక్ష

by Nallavelli.Anjaneyulu |

దిశ,​ తాడ్వాయి: ఎండ‌న‌క‌, వాన‌న‌క‌, ప‌గ‌ల‌న‌క‌, రేయ‌న‌క క‌ష్ట‌ప‌డి రెక్కాడించి పండించిన పంటను అ

అన్నదాతకు అగ్నిపరీక్ష
X

దిశ,​ తాడ్వాయి: ఎండ‌న‌క‌, వాన‌న‌క‌, ప‌గ‌ల‌న‌క‌, రేయ‌న‌క క‌ష్ట‌ప‌డి రెక్కాడించి పండించిన పంటను అమ్ముకుందామంటే అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. తాడ్వాయి సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో సాంకేతిక సమస్యలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకవైపు సర్వర్ మొరాయింపు.. మరోవైపు వేలిముద్రలు పడకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు సమీపిస్తున్నా సంబందించిన అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​ తీరని వేలిముద్రల తిప్పలు

​మక్కల కొనుగోలుకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో వృద్ధులు, చేతులు అరిగిన రైతులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం నుంచి తాడ్వాయి సోసైటీ వద్దే పడిగాపులు కాస్తున్నా.. సర్వర్ డౌన్ అంటూ సిబ్బంది పంపిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

​అధికారుల మధ్య నలుగుతున్న రైతు

​వేలిముద్రలు రాని పక్షంలో వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే.. వారు కౌలు రైతుల పేరు మీద నమోదు చేసుకోండి అని చెబుతు సోసైటీ కి పంపిస్తే..తీరా సొసైటీ కేంద్రానికి వెళ్తే, అక్కడ ఆన్‌లైన్ పోర్టల్‌లో కౌలు రైతు ఆప్షన్ లేదని సిబ్బంది పేర్కొంటున్నారు.అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులకు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ముంచుకొస్తున్న గడువు.. ఆందోళనలో అన్నదాత

మక్కల కొనుగోలుకు ఆగస్టు 31 ఆఖరి తేదీ కావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గడువు లోగా పంట అమ్ముకోకపోతే భారీగా నష్టపోతామని వారు వాపోతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇన్ని నిబంధనలా? సర్వర్ సమస్యలను పరిష్కరించలేని స్థితిలో అధికారులు ఉన్నారా?అని రైతులు నిలదీస్తున్నారు.

రైతుల డిమాండ్లు

వెంటనే సర్వర్ సమస్యలను పరిష్కరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. వేలిముద్రలు పడని రైతులకు ఐరిస్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవకాశం కల్పించాలి.​ఆన్‌లైన్‌లో కౌలు రైతుల నమోదుకు తక్షణమే ఆప్షన్ కల్పించాలి.​పంట కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారులు స్పందించి,పెట్టిన గడువు పెంచి ప్రతి గింజా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని తాడ్వాయి మండల రైతులు కోరుతున్నారు.

Next Story