- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ.. రీల్స్‌కు వేదికైంది..!
గ్రామీణ ప్రాంత పేదలకు వంద రోజుల పని కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది.

దిశ,తాడ్వాయి: గ్రామీణ ప్రాంత పేదలకు వంద రోజుల పని కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడంతో కొన్ని ప్రాంతాల్లో ఉపాధి పనులు కాస్తా సోషల్ మీడియా రీల్స్‌కు, వింత చేష్టలకు వేదికగా మారుతున్నాయా, ఈ ఏడాది ఉపాధి హామీ పనుల్లో మునుపెన్నడూ చూడని వింతలు, విచిత్రాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తుండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిబంధనల ముసుగులో కాలయాపన..
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన రెండు పూటల ఆన్‌లైన్ అటెండెన్స్ విధానమే ఈ వింత పోకడలకు ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కూలీలు ఉదయం పూట తమకు కేటాయించిన పనిని కేవలం 3 నుంచి 4 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. ఉదయం 10 లేదా 11 గంటలకే పని ముగిసిపోతున్నప్పటికీ, మధ్యాహ్నం రెండో సారి అటెండెన్స్ ఇవ్వాల్సి ఉండటంతో కూలీలు ఎండలోనే పని స్థలాల వద్దే ఉండిపోవాల్సి వస్తోంది. ఉదయం పని ముగిసిన సమయం నుండి మధ్యాహ్నం అటెండెన్స్ తీసుకునే సమయం వరకు మధ్యలో గంటల కొద్దీ ఖాళీ సమయం దొరుకుతుండటంతో, ఆ కాలయాపనే ఈ వింత విన్యాసాలకు కారణమవుతోంది.
లైకులు, వ్యూస్ కోసం పాట్లు..
ఈ ఖాళీ సమయంలో కొంతమంది కూలీలు స్మార్ట్‌ఫోన్లతో ఇన్స్‌టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం వింత ప్రయోగాలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. పని స్థలంలో బతుకమ్మ ఆటలు ఆడటం, సమూహాలుగా నృత్యాలు చేయడం ఒకెత్తయితే.. ఏకంగా పెళ్లిళ్లలో జరిగే సాంప్రదాయ తంతులు, అప్పగింతల ఘట్టాలను ఉపాధి హామీ క్షేత్రాల్లోనే రీ క్రియేట్ చేస్తూ వీడియోలు తీసి నెట్టింట వదులుతున్నారు.
తాజాగా పూనకాలు - శిగాలు
వీటన్నింటిని మించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఉపాధి పనులు ముగిసి,అటెండెన్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఓ మహిళకు దేవత పూనకం వచ్చినట్లు, ఆమె శిగముగుతూ ఊగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. చుట్టూ ఉన్న మిగతా కూలీలు కూడా పనులు ఆపేసి, ఆమె చుట్టూ చేరి భక్తిభావంతో నమస్కరిస్తూ కాలం గడపడం గమనార్హం.
ప్రభుత్వ సొమ్ముతో కాలయాపనా..?
ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి విన్యాసాలు చేయడం ఏంటని?స్థానికులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. గంటల లెక్కన కూలి తీసుకుంటూ.. పని వేళల్లో ఇలాంటి రీల్స్ పిచ్చి, పూనకాలు నడవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
పర్యవేక్షణ కరువైందా..?
క్షేత్రస్థాయిలో మేట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు క్వాలిటీ కంట్రోల్ అధికారుల నిరంతర పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పని స్థలాల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పని ముగిశాక కూలీలు క్రమశిక్షణతో ఉండేలా చూడాల్సిన బాధ్యత మేట్లపై ఉందని అధికారులు చెబుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,ఉపాధి హామీ క్షేత్రాల్లో ఇలాంటి వింత చేష్టలకు అడ్డుకట్ట వేయాలని, పనుల నాణ్యతను, సమయాన్ని కాపాడాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.






